పిచ్‌ను నిందించడం సరికాదు

అహ్మదాబాద్‌లో జరిగిన డే/నైట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ ఘోర పరాభవానికి స్పిన్‌కు అనుకూలించే పిచ్చే కారణమని అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ స్పందించాడు...

Updated : 28 Feb 2021 11:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అహ్మదాబాద్‌లో జరిగిన డే/నైట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ ఘోర పరాభవానికి స్పిన్‌కు అనుకూలించే వికెటే కారణమని అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ స్పందించాడు. పిచ్‌ను నిందించడం సరికాదని, అలా చేయడం తప్పని జొనాథన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరింత మంచిగా బ్యాటింగ్‌ చేసి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవన్నాడు.

‘ఎవరికైనా అక్కడ ఆడటం కొన్నిసార్లు కష్టమనే అనిపించింది. అది జీవం లేని వికెట్‌లా కనిపించింది. తొలుత దానికి అలవాటు పడడంతో మంచి స్కోర్‌ సాధించి టీమ్‌ఇండియాపై ఒత్తిడి తేగలం అనుకున్నాం. తర్వాత మేం బౌలింగ్‌ చేశాక.. టీమ్‌ఇండియాను కూడా కట్టడి చేయొచ్చని భావించాం. అయితే, మా ఓటమికి సాకులు వెతికేకన్నా ఏం చేస్తే జట్టుకు మంచిదనే విషయంపైనే నేనెప్పుడూ దృష్టిసారిస్తా. తొలి ఇన్నింగ్స్‌లో మా జట్టు 200-250 పరుగులు చేసి ఉంటే మ్యాచ్‌ ఫలితం భిన్నంగా ఉండేది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆటగాళ్ల ఆలోచనా దృక్పథం కూడా మారిపోయి ఉండొచ్చు’ అని ట్రాట్‌ పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలోనే పిచ్‌ను నిందించడం సరికాదని, అలా చేస్తే తమని తాము కించపర్చకున్నట్లే అని ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ కోచ్‌ అభిప్రాయపడ్డాడు. బంతి తిరగడం ఇరు జట్లకూ  సమానమేనని చెప్పాడు. మ్యాచ్‌ ఎన్ని రోజుల్లో ముగిసినా అందరూ మంచి క్రికెట్‌నే చూడాలనుకుంటారని అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్‌, బౌలర్ల మధ్య పోటీ వాతావరణం ఆస్వాదించాలనుకుంటారని వివరించాడు. అయితే, ఈ టెస్టులో బౌలర్ల ఆధిపత్యం కనపడిందని జొనాథన్‌ స్పష్టంచేశాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ పరిస్థితుల్లో ఆడటమే టెస్టు క్రికెట్‌ ప్రత్యేకతని ఈ ఫార్మాట్‌ను కొనియాడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని