INDW vs ENGW : ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు రెండో ఓటమి.. బోణీ కొట్టిన ఇంగ్లాండ్‌

మహిళల ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు రెండో ఓటమి ఎదురైంది. ఇప్పటి వరకు..

Updated : 16 Mar 2022 13:33 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు రెండో ఓటమి ఎదురైంది. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో బోణీ కొట్టని ఇంగ్లాండ్‌ తొలి విజయం నమోదు చేసుకుంది. మౌంట్ మౌంగనీయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్‌ ఎంచుకుని భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో 31.2 ఓవర్లలో ఆరు వికెట్లను నష్టపోయి 136 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ గెలుపొందింది. భారత బౌలర్లలో మేఘ్న సింగ్‌ 3.. ఝులన్‌ గోస్వామి, రాజేశ్వరి, పూజ వస్త్రాకర్‌ తలో వికెట్ తీశారు.

ఆరంభంలోనే అదుర్స్‌.. చివర్లో కంగారు పెట్టినా

భారత్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ ఆదిలోనే తడబడింది. మేఘ్న సింగ్‌, ఝులన్‌ గోస్వామి చెలరేగడంతో ఇంగ్లాండ్‌ ఓపెనర్లు టామీ బ్యూమౌంట్ (1), వ్యాట్ (1) త్వరగా పెవిలియన్‌కు చేరారు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్‌ హీథెర్ నైట్ (53*) అద్భుతమైన అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చింది. నైట్‌కు తోడుగా నటాలీ స్కివెర్ (45) చక్కని తోడ్పాటు అందించింది. వీరిద్దరూ కలిసి 65 పరుగులు జోడించారు. నటాలీ ఔటైనప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎలెన్ (10), సోఫియా (17), సోఫీ (5*)తో కలిసి కెప్టెన్‌ నైట్ జట్టును గెలిపించింది. చివర్లో మేఘ్న సింగ్‌ వరుసగా రెండు వికెట్లు తీసినా అప్పటికే ఆలస్యమైంది. దీంతో ప్రపంచకప్‌లో రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో భారత్‌ (4) మూడో స్థానంలో కొనసాగుతోంది. టీమ్‌ఇండియా తదుపరి మ్యాచ్‌ను మార్చి 19న ఆసీస్‌తో తలపడనుంది.

ఎనిమిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం

టీమ్‌ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్మృతీ మంధాన (35), రిచా ఘోష్ (33), ఝులన్‌ గోస్వామి (20) కాస్త ఫర్వాలేదనిపించారు. యాస్తిక భాటియా 8, మిథాలీరాజ్‌ 1, హర్మన్‌ ప్రీత్ కౌర్ 14, పూజ వస్త్రాకర్‌ 6, మేఘ్న సింగ్ 3* పరుగులు చేశారు. దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా డకౌట్‌గా వెనుదిరిగారు. 28 పరుగులకే మూడు వికెట్లను కోల్పోగా.. ఓపెనర్‌ స్మృతీ మంధాన-హర్మన్‌ ప్రీత్‌ కలిసి 33 పరుగులు జోడించారు. హర్మన్‌ ఔటైన తర్వాత స్వల్ప వ్యవధిలో స్నేహ్‌ రాణా, స్మృతీ మంధాన, పూజ వికెట్లను భారత్‌ చేజార్చుకుంది. అయితే 86/7తో ఉన్న టీమ్‌ఇండియా 134 పరుగులు చేసేందంటే రిచా ఘోష్-ఝులన్‌ జోడీనే కారణం. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఇదే భారీ భాగస్వామ్యం కావడం విశేషం. ఇంగ్లాండ్‌ బౌలర్లలో డీన్‌ 4, అన్య ష్రుబ్‌సోలె 2.. సోఫీ, కేట్‌ క్రాస్ చెరో వికెట్ తీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు