FIFA World Cup: సెనెగల్‌ను ఓడించి క్వార్టర్స్‌కు ఇంగ్లాండ్‌.. ఫ్రాన్స్‌తో ఇక అమీతుమీ

ప్రీక్వార్టర్స్‌లో సెనెగల్‌పై పూర్తి ఆధిపత్యం సాధించిన ఇంగ్లాండ్‌ జట్టు 3-0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

Updated : 05 Dec 2022 04:44 IST

(Photo: FIFA Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో భాగంగా నాకౌట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ జట్టు అదరగొట్టింది. ప్రీక్వార్టర్స్‌లో సెనెగల్‌పై పూర్తి ఆధిపత్యం సాధించిన ఇంగ్లాండ్‌ జట్టు 3-0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇక క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. డిసెంబర్‌ 11న ఇంగ్లాండ్‌-ఫ్రాన్స్‌ జట్ల మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ జరగనుంది. ఈ పోరులో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌కు దూసుకెళతారు.  

మ్యాచ్‌లో ఎక్కువ శాతం బంతిని తన ఆధిపత్యంలోనే ఉంచుకున్న ఇంగ్లాండ్‌ జట్టు సెనెగల్‌ను ఒక్క గోల్‌ చేయకుండా అడ్డుకుంది. తొలి అర్ధభాగంలో 38 నిమిషాల వద్ద జుడె బెల్లింగమ్‌ నుంచి పాస్‌ అందుకున్న జోర్డాన్‌ అద్భుత రీతిలో గోల్‌గా మలిచి తమ జట్టును 1-0 తేడాతో అధిక్యంలో నిలిపాడు. ఇక తొలి అర్ధభాగం అదనపు సమయంలో ఫిల్‌ ఫోడెన్‌ నుంచి పాస్‌ అందుకుని హారీ కేన్‌ గోల్‌ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ 2-0 తేడాతో మరింత ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆట ప్రారంభంలో బంతిని తమ నియంత్రణలో ఉంచుకున్న సెనెగల్‌ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. పలుసార్లు గోల్‌ పోస్టువైపు దూసుకుపోయినప్పటికీ ఇంగ్లాండ్‌ డిఫెండర్లు బలంగా అడ్డుకున్నారు. ఇక రెండో అర్ధభాగంలో 57 నిమిషాల వద్ద బుకాయో సాక గోల్‌ కొట్టి బ్రిటీష్‌ జట్టును 3-0 తేడాతో మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఇక సెనెగల్‌ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ ఒక్కగోల్‌ కూడా చేయలేక ఓటమి మూటగట్టుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని