CWG 2022 : కామన్వెల్త్‌ నుంచి తప్పుకొన్న ఇంగ్లాండ్‌ కెప్టెన్.. భారత్‌కు ఊరట!

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఊరటనిచ్చే వార్త. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ గాయం కారణంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో...

Updated : 05 Aug 2022 10:56 IST


(ఫొటో సోర్స్: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఊరటనిచ్చే వార్త. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ గాయం కారణంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు దూరమైంది. మరి టీమ్ఇండియాకు సంబంధం ఏంటంటారా...? కామన్వెల్త్ గేమ్స్‌ క్రికెట్‌ సెమీస్‌లో ఇంగ్లాండ్‌తోనే భారత్‌ శనివారం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు) తలపడనుంది. గాయం కారణంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌నూ నైట్‌ ఆడలేకపోయింది. అయితే గాయం తీవ్రతను పరిశీలించిన వైద్యబృందం విశ్రాంతి అవసరమని సూచించడంతో నైట్‌ కామన్వెల్త్‌ టీమ్‌ నుంచి వైదొలగింది. ఆమె స్థానంలో నటాలీ స్కివెర్ సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఇంగ్లాండ్‌ను విజయవంతంగా నడిపించే హీథర్‌ లేకపోవడం కీలకమైన సెమీస్‌ పోరులో ఆ జట్టుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

‘‘కామన్వెల్త్‌ గేమ్స్‌లో నటాలీ స్కివెర్ ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన హీథర్ నైట్ స్థానంలో మరో ప్లేయర్‌ని తీసుకోవడం లేదు. 14 మంది స్క్వాడ్‌తోనే ఇంగ్లాండ్‌ మిగతా మ్యాచ్‌లకు కొనసాగుతుంది’’ అని ఇంగ్లాండ క్రికెట్‌ బోర్డు ట్వీట్‌ చేసింది. హీథర్ నైట్‌ ఇప్పుడు జరుగుతోన్న కామన్వెల్త్‌ నుంచే కాకుండా డొమెస్టిక్‌ లీగ్ ‘100’ టోర్నమెంట్‌ నుంచి కూడా తప్పుకొంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇంగ్లాండ్‌ మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి గ్రూప్‌-Bలో అగ్రస్థానం దక్కించుకుంది. దీంతో గ్రూప్‌-Aలో రెండో స్థానంలో ఉన్న టీమ్‌ఇండియాతో సెమీస్‌ పోరులో తలపడనుంది. హర్మన్‌ప్రీత్‌ నాయకత్వంలోని భారత్‌ ఆసీస్‌ మీద ఓడి మిగిలిన రెండు మ్యాచుల్లో (పాక్‌, బార్బడోస్‌) విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని