IPL 2023: బెన్‌స్టోక్స్‌ ఐపీఎల్‌ ఆడటం వల్ల ‘యాషెస్‌’కు ఇబ్బందేమీ లేదు: మెక్‌కల్లమ్‌

మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023) ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) తన తొలి మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్‌ (GT)తో తలపడనుంది.

Updated : 02 Mar 2023 22:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023)లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఫ్రాంచైజీ భారీ మొత్తం వెచ్చించి మరీ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను దక్కించుకొంది. అయితే, 16వ సీజన్‌కు అందుబాటులో ఉంటాడా..? కనీసం కొన్ని మ్యాచ్‌లైనా ఆడతాడా..? అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఎందుకంటే మెగా టోర్నీ మే 28వ తేదీతో ముగుస్తుంది. ఇక జూన్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్‌ (Ashes Series) జరగనుంది. దీంతో మే చివరి వరకు టీ20 ఫార్మాట్‌లో ఆడి.. మరో పదిహేను రోజుల్లోనే టెస్టులు ఆడటం అంత సులువైన విషయం కాదు. అయితే, చెన్నై అభిమానుల అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం ఆడతానని బెన్‌ స్టోక్స్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చాడు. కానీ, యాషెస్ సన్నద్ధత గురించి ఇంగ్లాండ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ మాత్రం కంగారు అక్కర్లేదని తేల్చి చెప్పాడు. కివీస్‌తో టెస్టు సిరీస్‌లో మోకాలి గాయం కారణంగా కేవలం తొమ్మిది ఓవర్లనే బౌలింగ్‌ చేశాడు.

‘‘ఐపీఎల్‌లో ఆడటం వల్ల బెన్ స్టోక్స్‌కు నష్టమేమీ ఉండదని భావిస్తున్నా. సీఎస్‌కే వైద్య బృందంపై నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే, తమ ఆటగాళ్లకు సీఎస్‌కే ఇచ్చే ట్రీట్‌మెంట్‌ అద్భుతంగా ఉంటుంది. బెన్‌ స్టోక్స్‌ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. క్లిష్టపరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలను తీసుకొవాలనేది అతడికి తెలుసు. ఇది అతడి జీవితమే కదా..? అందుకే నాకు ఎలాంటి ఆందోళన లేదు. యాషెస్‌ సిరీస్‌లో అతడు కీలకంగా మారతాడు. కెప్టెన్సీ లేకపోతే ఇంకా మెరుగ్గా ఆడతాడు. ఆందోళనలు లేకుండా ఆడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అతడి నాయకత్వంలో మైదానంలోకి దిగితే చాలు ఇంగ్లాండ్ యాషెస్ క్యాంపెయిన్‌ ఘనంగా ఉంటుంది. యాషెస్‌ స్క్రిప్ట్‌ రాసేందుకు మా కెప్టెన్‌ వేచి చూస్తుంటాడని భావిస్తున్నా’’ అని మెక్‌కల్లమ్‌ తెలిపాడు. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ -16 సీజన్‌ ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని