Ollie Robinson: రాబిన్‌సన్ ఇకపై క్రికెట్‌ ఆడొచ్చు

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌కు భారీ ఊరట లభించింది. గతంలో జాతివివక్ష, విద్వేషాలకు సంబంధించిన ట్వీట్లు చేయడంతో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) గతనెల అతడిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే...

Published : 04 Jul 2021 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌కు భారీ ఊరట లభించింది. గతంలో జాతివివక్ష, విద్వేషాలకు సంబంధించిన ట్వీట్లు చేయడంతో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) గతనెల అతడిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా విచారణ పూర్తి చేసిన ఈసీబీ అతడిపై మొత్తంగా 8 మ్యాచ్‌ల నిషేధం, 3,200 పౌండ్ల జరిమానా విధించింది. మరోవైపు ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరమైన రాబిన్‌సన్‌ మరో ఐదు మ్యాచ్‌లను రెండేళ్ల కాలపరిమిలో నిషేధం ఎదుర్కోవాల్సి ఉంది. దాంతో ఇప్పుడతడు వెంటనే ఇంగ్లాండ్‌ జట్టులో కలిసే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆడే తర్వాతి మ్యాచ్‌లోనూ పాల్గొనే వీలు కలిగింది.

కాగా, ఇంగ్లాండ్‌ గతనెల న్యూజిలాండ్‌తో ఆడిన తొలి టెస్టులోనే రాబిన్‌సన్‌ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో 2012-13 కాలంలో అతడు చేసిన జాతివివక్ష, విద్వేషపూరిత ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఈసీబీ చర్యలు తీసుకుంది. లార్డ్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండర్‌ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ లోయర్‌ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేశాడు. దాంతో ఇంగ్లాండ్‌ జట్టుకు అతడో ఆశాకిరణంలా కనిపించాడు. కానీ, ఆ మ్యాచ్‌ పూర్తవ్వగానే ఈసీబీ అతడిపై నిషేధం విధించింది. దాంతో రాబిన్‌సన్‌ కెరీర్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాను గతంలో తెలియక చేసిన పొరపాటుకు రాబిన్‌సన్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే పూర్తి విచారణ చేసిన ఈసీబీ ఇప్పుడు 8 మ్యాచ్‌ల నిషేధం, జరిమానా విధించి కెరీర్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని