జోఫ్రా ఆర్చర్‌ చేతివేలిలో గాజు ముక్క 

టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కుడిచేతికి గాయం తిరగబెట్టడంతో స్వదేశం వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు సోమవారం శస్త్రచికిత్స చేయించుకున్నాడు...

Published : 31 Mar 2021 01:08 IST

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ గైల్స్‌..

(Photo: Jofra Archer Twitter)

లండన్‌: టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కుడిచేతికి గాయం తిరగబెట్టడంతో స్వదేశం వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు సోమవారం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సందర్భంగా వైద్యులు అతడి కుడిచేతి మధ్య వేలిలో చిన్నపాటి గాజుముక్క కనుగొన్నట్లు ఆ జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టెర్‌ ఆష్లీ గైల్స్‌ వెల్లడించారు. ఆర్చర్‌ గాయంపై తాజాగా స్పందించిన గైల్స్‌ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

జనవరిలో టీమ్‌ఇండియా పర్యటనకు ముందు ఆర్చర్‌ తన ఇంట్లో చేపల తుట్టిని(ఫిష్‌ ట్యాంక్‌) శుభ్రం చేస్తుండగా గాయపడ్డాడని గైల్స్‌ చెప్పాడు. అప్పుడు అతడి మధ్యవేలు తెగిందని, అది కొద్దిరోజుల్లోనే నయమవడంతో భారత పర్యటనకు వచ్చాడన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆర్చర్‌ టెస్టు, టీ20 సిరీస్‌లు ఆడాడని తెలిపాడు. అయితే, వన్డే సిరీస్‌కు ముందు అతడి మోచేతి గాయం ఇబ్బంది పెట్టడంతో ఇంగ్లాండ్‌కు తిరిగి పంపించామన్నాడు. దీంతో సోమవారం జరిగిన శస్త్రచికిత్సలో ఆర్చర్‌ మధ్య వేలిలో గాజుముక్క బయటపడిందన్నాడు. కాగా, గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో తొలిసారి ఆర్చర్‌ మోచేతికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి అతడు కుడి మోచేతితో ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పుడు శస్త్రచికిత్స జరిగినందున వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌కు దూరంకానున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని