Australia vs Scotland: స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్‌-8కు ఇంగ్లాండ్‌

Australia vs Scotland: ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సూపర్‌8లో ఇంగ్లాండ్‌కు బెర్త్‌ ఖరారైంది.

Updated : 16 Jun 2024 11:10 IST

గ్రాస్‌ఐలెట్‌: టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు అదృష్టం కలిసొచ్చింది. అత్యుత్తమ రన్‌రేట్‌తో గ్రూప్-Bలో ఆస్ట్రేలియాతో పాటు సూపర్ - 8కి అర్హత సాధించింది. తొలుత నమీబియాపై ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌ రన్‌రేట్‌ను భారీగా పెంచుకుంది. అనంతరం ఆసీస్‌తో జరిగిన కీలక పోరులో చేతులెత్తేసిన స్కాట్లాండ్‌ ఇంటిముఖం పట్టింది. 

స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా (Australia vs Scotland) విజయం సాధించింది. ట్రావిస్‌ హెడ్‌ (68), మార్కస్‌ స్టొయినిస్‌ (59) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌.. ఆసీస్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వికెట్లను ఆస్ట్రేలియా వేగంగా చేజార్చుకుంది. హెడ్‌, స్టొయినిస్‌ దూకుడుతో తిరిగి గాడిన పడింది. చివరకు మాథ్యూ వేడ్‌, టిమ్‌ డేవిడ్‌ తమదైన శైలిలో మ్యాచ్‌ను ముగించారు. దీంతో 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించిన ఆసీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.

స్కాట్లాండ్‌ ఓటమితో ఇంగ్లాండ్‌ సూపర్‌8కు చేరింది. గ్రూప్‌-బిలో ఈ ఇరు జట్లకు సమానమైన పాయింట్లు ఉండగా.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌ కారణంగా ఇంగ్లాండ్‌ తదుపరి దశకు చేరింది. తొలుత బ్రెండన్‌ మెక్కలెన్‌ 34 బంతుల్లో 60 పరుగులు చేయటంతో స్కాట్లాండ్‌ స్కోర్‌ దూసుకెళ్లింది. జార్జ్‌ మున్సే (35)తో కలిసి అతడు నిర్మించిన 89 పరుగుల భాగస్వామ్యం జట్టు మెరుగైన స్కోర్‌ సాధించేందుకు దోహదం చేసింది. కెప్టెన్‌ రిచీ బెరిగ్టంన్‌ 42 (నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో జట్టు స్కోర్‌ 180/5కు చేరింది.

చిన్నోళ్లు దమ్మున్నోళ్లు

నమీబియాపై ఇంగ్లాండ్‌ గెలుపు..

అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో 10 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చతికిలపడ్డ నమీబియా మూడు వికెట్లు నష్టపోయి 84 పరుగులే చేయగలిగింది. దీంతో 41 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. 

వర్షం కారణంగా ఇప్పటికే స్కాట్లాండ్‌ వర్సెస్‌ ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ రద్దయింది. నమీబియాతోనూ అదే జరిగి ఉంటే ఇంగ్లాండ్‌ ఇంటి బాట పట్టడం ఖాయమయ్యేది. కానీ, వరుణుడు సహకరించడంతో ఎట్టకేలకు పది ఓవర్ల మ్యాచ్‌ ఆ జట్టును గట్టెక్కించింది! తొలుత ఇంగ్లాండ్‌ బ్యాటర్లు తడబడ్డారు. తొలి 13 బంతుల్లోనే 13 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. కానీ, బెయిర్‌స్టో (18 బంతుల్లో 31 పరుగులు), బ్రూక్‌ (20 బంతుల్లో 47 పరుగులు) జట్టును ఆదుకున్నారు. చివరి ఓవర్‌లో మోయిన్‌ అలీ, లివింగ్‌ స్టోన్‌ చేసిన 21 పరుగులు మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాయి. లక్ష్య ఛేదనలో తడబడ్డ నమీబియా నిర్దేశిత 10 ఓవర్లలో 84 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ గెలుపుతో గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌ (+3.611 నెట్‌రన్‌రేట్‌) ఐదు పాయింట్లు సాధించింది. స్కాట్లాండ్‌కు సైతం అన్నే పాయింట్లు ఉండటంతో సూపర్‌-8కు ఏ జట్టు చేరాలో నిర్ణయించడానికి ఆస్ట్రేలియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ మ్యాచ్‌ ఫలితం అనివార్యమైంది. కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఆ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఓడిపోవడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. స్కాట్లాండ్‌ నెట్‌రన్‌రేట్ (+1.255) కంటే ఇంగ్లాండ్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో తదుపరి దశకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు