T20 World Cup: ఇంగ్లాండ్‌.. రయ్యిమని

ఇంగ్లాండ్‌ అదరహో! టీ20 ప్రపంచకప్‌ ఆరంభం నుంచి ఇబ్బందిపడుతూ సాగిన ఆ జట్టు.. టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇంగ్లాండ్‌ తన ఆఖరి సూపర్‌-8 మ్యాచ్‌లో ఆదివారం 10 వికెట్ల తేడాతో అమెరికాను చిత్తు చేసింది.

Updated : 24 Jun 2024 10:18 IST

అమెరికాపై ఘనవిజయంతో ప్రపంచకప్‌ సెమీస్‌కు
బ్రిడ్జ్‌టౌన్‌

ఇంగ్లాండ్‌ అదరహో! టీ20 ప్రపంచకప్‌ ఆరంభం నుంచి ఇబ్బందిపడుతూ సాగిన ఆ జట్టు.. టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇంగ్లాండ్‌ తన ఆఖరి సూపర్‌-8 మ్యాచ్‌లో ఆదివారం 10 వికెట్ల తేడాతో అమెరికాను చిత్తు చేసింది. రన్‌రేట్‌ బాగా మెరుగుపడడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. జోర్డాన్‌ (4/10), అడిల్‌ రషీద్‌ (2/13), సామ్‌ కరన్‌ (2/23) ధాటికి మొదట అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. నితీష్‌ కుమార్‌ (30; 24 బంతుల్లో 1×4, 2×6) టాప్‌ స్కోరర్‌. అనంతరం బట్లర్‌ (83 నాటౌట్‌; 38 బంతుల్లో 6×4, 7×6) వీరవిహారం చేయడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 9.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా అలవోకగా ఛేదించింది. ఇంగ్లాండ్‌ది నిజంగా స్ఫూర్తిదాయక ప్రదర్శనే. ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టినా, గ్రూప్‌ దశలో కష్టపడి సూపర్‌-8 చేరిన ఆ జట్టు.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో అమెరికాపై భారీ విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో అవసరానికి తగ్గట్టు అదరగొట్టిన ఇంగ్లాండ్‌.. గ్రూపులో అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడో స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లలో ఒక్క దానికి మాత్రమే తనను అధిగమించే అవకాశాలున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ముందంజ వేస్తాయన్న సంగతి తెలిసిందే.

జోర్డాన్‌ హ్యాట్రిక్‌.. బట్లర్‌ విధ్వంసం: కీలక మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అమెరికా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి తేలిపోయింది. తొలి ఓవర్లోనే గాస్‌ (8) వికెట్‌ను కోల్పోయిన అమెరికా.. నితీశ్‌ బ్యాట్‌ ఝళిపించడంతో 5.2 ఓవర్లలో 43/1తో పర్వాలేదనిపించే స్థితిలో నిలిచింది. కానీ టేలర్‌ (12)ను ఔట్‌ చేయడం ద్వారా రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని కరన్‌ విడదీయడంతో అమెరికా ఇన్నింగ్స్‌ గతి తప్పింది. కోరీ అండర్సన్‌ (29), హర్మీత్‌ సింగ్‌ (21) మాత్రమే కాసేపు నిలిచారు. జోర్డాన్‌ 19వ ఓవర్లో హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. తొలి బంతికి అండర్సన్‌న వెనక్కి పంపిన అతడు.. మూడు, నాలుగు, అయిదో బంతుల్లో వరుసగా అలీ ఖాన్, కెంజిగె, నేత్కావల్కర్‌లను ఔట్‌ చేయడంతో అమెరికా ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇంగ్లాండ్‌ ఛేదనలో ఓపెనర్‌ సాల్ట్‌ (25 నాటౌట్‌; 21 బంతుల్లో 2×4) సహకరిస్తుండగా మరో ఓపెనర్‌ బట్లర్‌ చెలరేగిపోయాడు. అతడు విధ్వంసక బ్యాటింగ్‌తో అమెరికా బౌలింగ్‌ను తుత్తునియలు చేయడంతో 62 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌ పని పూర్తి చేసింది. హర్మీత్‌ సింగ్‌ ఓవర్లో బట్లర్‌ అయిదు సిక్స్‌లు కొట్టడం విశేషం.

అమెరికా: 115 (నితీశ్‌ కుమార్‌ 30; జోర్డాన్‌ 4/10, రషీద్‌ 2/13, సామ్‌ కరన్‌ 2/23); ఇంగ్లాండ్‌: 117/0 (బట్లర్‌ 83 నాటౌట్, సాల్ట్‌ 25 నాటౌట్‌)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని