WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. టీమ్‌ఇండియా ఆ ఒక్క మార్పు చేస్తే చాలు: మైకెల్‌ వాన్

వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాపింయన్‌షిప్‌ ఫైనల్‌కు (WTC Final) దూసుకెళ్లిన టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష మాత్రం తప్పదు. ఫాస్ట్‌బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ఆసీస్‌ను ఢీకొట్టాలంటే కఠినంగా శ్రమించాల్సిందే.

Published : 29 Apr 2023 01:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం ఐపీఎల్ (IPL) మెగా టోర్నీ జరుగుతోంది. ఇది ముగిశాక జూన్‌ 7వ తేదీ నుంచి టీమ్‌ఇండియా లండన్‌లోని ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్‌లో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. చాలా రోజుల తర్వాత అజింక్య రహానెకు అవకాశం దక్కగా.. సూర్యకుమార్‌ను తప్పించింది. అయితే కేఎల్ రాహుల్‌కు మాత్రం అవకాశం రావడం గమనార్హం. కేఎల్‌ కూడా మొన్నటి వరకు పెద్దగా ఫామ్‌లో లేడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్‌ పలు కీలక సూచనలు చేశాడు. ఓవల్‌ బంతి గమనం డిఫరెంట్‌గా ఉంటుందని, యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమని పేర్కొన్నాడు. అందుకే, సీనియర్‌ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను రోహిత్‌తోపాటు ఓపెనింగ్‌ చేయిస్తే మంచిదని సూచించాడు. 

‘‘ఓవల్ పిచ్‌ పరిస్థితికి అనుగుణంగా భారత తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేస్తే సరిపోతుంది. ఈ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగిందనేది మరిచిపోవాలి. ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చుకుంటే బెటర్. శుభ్‌మన్ గిల్ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా పంపించాలి. అత్యుత్తమ తుది జట్టుతో బరిలోకి దిగడమే కాకుండా పదునైన వ్యూహాలను అమలు చేయాలి. బంతి నేరుగా బ్యాట్‌ మీదకు వస్తుంటే మాత్రం శుభ్‌మన్‌ గిల్ చాలా ప్రమాదకారి. అయితే, ఓవల్‌లో బాల్‌ కదలిక విభిన్నంగా ఉంటుంది. అందుకే, టెక్నికల్‌గా గిల్ కంటే ఉత్తమంగా ఉండే కేఎల్ రాహుల్‌ను రోహిత్‌కు జతగా పంపించాలి. ఇలాగే చేయాలని చెప్పగలను కానీ, నేనేమీ తుది నిర్ణయం తీసుకోలేను. తుది జట్టు ఎంపిక మాత్రం కేవలం ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కావాలి. తర్వాత వెస్టిండీస్‌ పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను ఆడించడం సరైన నిర్ణయం అనిపించదు’’ అని మైకెల్ వాన్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని