WTC Final: పిచ్‌ ఎలా ఉన్నా.. భారత్‌ మాత్రం ఆ పొరపాటు చేయకూడదు: నాసిర్‌ హుస్సేన్

భారత్‌ తన తుది జట్టు ఎంపికపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ హెచ్చరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final) గెలవాలంటే తప్పదని స్పష్టం చేశాడు.

Updated : 06 Jun 2023 18:28 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ (WTC Final)కు చేరింది. బుధవారం నుంచి ఆసీస్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌ విజయం సాధించింది. వర్షం వల్ల పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా మారినప్పటికీ..  స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు ఫలితం అనుకూలంగా రాలేదు. అశ్విన్, రవీంద్ర జడేజా విఫలం కావడం భారత్‌ ఓటమికి ప్రధాన కారణం. అదనంగా పేసర్‌ లేకపోవడం కూడా టీమ్‌ఇండియాకు కలిసిరాలేదు. ఈసారి కూడా ఇంగ్లాండ్‌  వేదిక కావడంతో పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ స్పిన్నర్లకూ సహకరిస్తుందనే వాదనా ఉంది. దీంతో తుది జట్టు కూర్పుపై మాజీలు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సున్నితంగా హెచ్చరించాడు. ఆసీస్‌ను వారి దేశంలోనే ఓడించిన భారత్‌.. ఎలాంటి పిచ్‌లపైనైనా గెలవగలదని వ్యాఖ్యానించాడు. 

‘‘వాతావరణం బాగుండి.. ఎండ ఎక్కువగా ఉంటే తన రెగ్యులర్‌ ఫార్ములాతోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుంది. ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతోపాటు మూడో పేసర్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకొనే వీలుంది. ఎండ ఉండటం వల్ల పేస్‌, స్పిన్‌కు పిచ్‌ సమానంగా అనుకూలించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే, గత డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ను ఓసారి గుర్తు చేసుకుంటే.. అప్పటి పిచ్‌ పరిస్థితులను టీమ్‌ఇండియా తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది. ఐదు రోజులూ లైట్లు ఆన్‌లోనే (వర్షం వల్ల) ఉన్నాయి. తేమ వాతావరణం ఉంది. అందుకే, కివీస్‌ ప్రధాన స్పిన్నర్‌తో కూడా బరిలోకి దిగలేదు. అయితే, భారత్ మాత్రం ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. సీమ్‌, స్వింగ్‌ ప్రభావం చూపిన పిచ్‌పై అలా తుది జట్టును ఎంపిక చేసుకుంది. ఈ సారి అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదు. 

గతంలో ఓవల్‌ మైదానంలో భారత్ నాణ్యమైన క్రికెట్‌ను ఆడింది. ఇంగ్లాండ్‌ను ఓడించింది. అందుకే, ఇప్పుడు ఓవల్‌ మైదానం మంచి వేదికగా నిలుస్తుందని భావిస్తున్నా. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు బంతితో పాటు తమ వంతు బ్యాటింగ్‌ సహకారం కూడా అందిస్తారు. కానీ, పిచ్‌ పరిస్థితిని బట్టి పేసర్లకే ఎక్కువ సహకారం లభిస్తున్నట్లు ఉంది. అందుకే, సీమర్లను తీసుకోవాలని చెబుతా. ఇంగ్లాండ్‌ మీద జడేజా అత్యుత్తమ బౌలింగ్‌ వేశాడు. మ్యాచ్‌ ఆరంభమయ్యే సమయానికి పిచ్‌, వాతావరణం పరిస్థితులను సరిగా అంచనా వేసి తుది జట్టును ఎంపిక చేసుకోవాలి. పరిస్థితులు డిమాండ్‌ చేస్తే.. ఇద్దరు టాప్‌ స్పిన్నర్లలో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. గొప్ప బౌలర్లు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాణ్యంగా బౌలింగ్‌ చేయగలరు. కానీ ఇది డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌. ఏమాత్రం అజాగ్రత్త వహించకూడదు’’ అని నాసిర్ హుస్సేన్ సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని