అహ్మదాబాద్‌ను అడిలైడ్‌గా భ్రమపడ్డ ఇంగ్లాండ్‌!

మొతేరాలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆ జట్టు మాజీ క్రికెటర్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ తీవ్రంగా విమర్శించాడు. దాని ఫలితమే పది వికెట్ల తేడాతో పరాజయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గులాబి టెస్టును అహ్మదాబాద్‌లో కాకుండా అడిలైడ్‌లో ఆడుతున్నామని ఇంగ్లిష్ జట్టు భావించిందని....

Published : 26 Feb 2021 21:20 IST

ఇంగ్లిష్ జట్టు సిగ్గుపడాలన్న జెఫ్రీ బాయ్‌కాట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొతేరాలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆ జట్టు మాజీ క్రికెటర్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ తీవ్రంగా విమర్శించాడు. దాని ఫలితమే పది వికెట్ల తేడాతో పరాజయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గులాబి టెస్టును అహ్మదాబాద్‌లో కాకుండా అడిలైడ్‌లో ఆడుతున్నామని ఇంగ్లిష్ జట్టు భావించిందని పేర్కొన్నాడు.

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌, సుందర్‌ ఇద్దరు పేసర్లు ఇషాంత్‌, బుమ్రాతో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లాండ్‌ మాత్రం ముగ్గురు పేసర్లు జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జోఫ్రా ఆర్చర్‌, ఒక స్పెషలిస్టు స్పిన్నర్‌ జాక్‌లీచ్‌ను ఎంపిక చేసింది. దాంతో కోహ్లీసేన ఎక్కువగా స్పిన్నర్లను ఉపయోగించుకోగా ఆంగ్లేయులకు ఆ అవకాశం లేకుండా పోయింది.

మూడో టెస్టులో ప్రదర్శన పట్ల ఇంగ్లాండ్‌ సిగ్గుపడాలని బాయ్‌కాట్‌ విమర్శించాడు. ‘టర్నింగ్‌ పిచ్‌పై ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలన్న అద్భుత ఆలోచన ఎవరిదో తెలుసుకోవాలని అనుకుంటున్నా. వారిందుకు సిగ్గుపడాలి. ఇంగ్లిష్‌ జట్టు గులాబి టెస్టును అహ్మదాబాద్‌లో కాకుండా అడిలైడ్‌లో ఆడుతున్నామని భ్రమపడి ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే అంతకు ముందు ‘గులాబి బంతి టెస్టులో బంతిని స్వింగ్‌ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాం’ అని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని