Euro 2024: ఇంగ్లాండ్‌ గట్టెక్కింది

ఫుట్‌బాల్‌లో స్విట్జర్లాండ్‌తో పోరంటే ఇంగ్లాండ్‌ను ఫేవరెట్‌గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్‌షిప్‌ గ్రూప్‌ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్‌లో ఆ జట్టు ఫేవరెట్‌గానే బరిలోకి దిగింది.

Published : 07 Jul 2024 03:33 IST

హోరాహోరీ క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌పై గెలుపు

డసెల్‌డార్ఫ్‌: ఫుట్‌బాల్‌లో స్విట్జర్లాండ్‌తో పోరంటే ఇంగ్లాండ్‌ను ఫేవరెట్‌గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్‌షిప్‌ గ్రూప్‌ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్‌లో ఆ జట్టు ఫేవరెట్‌గానే బరిలోకి దిగింది. కానీ లీగ్‌ దశలో ఇటలీనే ఇంటిముఖం పట్టించిన స్విట్జర్లాండ్‌ అంత తేలిగ్గా లొంగలేదు. ఇంగ్లాండ్‌కు దీటుగా బదులిచ్చింది. అంతే కాదు మ్యాచ్‌లో మొదట ఆ జట్టే ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ తర్వాత పుంజుకుని స్కోరు సమం చేసిన ఇంగ్లాండ్‌.. పెనాల్టీ షూటౌట్లో 5-3తో పైచేయి సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. తనకంటే బలమైన ఇంగ్లాండ్‌కు దీటుగా బదులిచ్చిన స్విస్‌.. 75వ నిమిషంలో బ్రీల్‌ ఎంబోలో గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో ఇంగ్లిష్‌ జట్టు ఇంటికేనా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఇంకో అయిదు నిమిషాలకే బుకాయో సాకా గోల్‌ కొట్టడంతో ఇంగ్లాండ్‌ ఊపిరి పీల్చుకుంది. నిర్ణీత సమయం ముగిసేలోపు, ఆ తర్వాత అదనపు సమయంలోనూ ఇరు జట్లూ మరో గోల్‌ సాధించకపోవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు మళ్లింది. అందులో పామర్‌ ఇంగ్లాండ్‌కు శుభారంభాన్నందించాడు. కానీ స్విస్‌ తొలి అవకాశాన్ని మాన్యువల్‌ అకాంజీ వృథా చేయడంతో ఇంగ్లాండ్‌కు ఆధిక్యం లభించింది. తర్వాత ఇంగ్లాండ్‌ తరఫున వరుసగా బెలింగ్‌హామ్, సాకా, టోనీ విజయవంతమయ్యారు. స్విస్‌ జట్టులో ఫాబియన్, షకిరి, జెకి కూడా స్కోర్‌ చేశారు. అయితే ఇంగ్లాండ్‌ చివరి ఛాన్స్‌ను ట్రెంట్‌ అలెగ్జాండర్‌ వృథా చేయకుండా గోల్‌ కొట్టేయడంతో స్విస్‌ జట్టుకు నిరాశ తప్పలేదు. తుర్కియే-నెదర్లాండ్స్‌ మధ్య క్వార్టర్స్‌ విజేతతో ఇంగ్లాండ్‌ సెమీస్‌ ఆడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని