Katherine Brunt: మహిళా క్రికెటర్ల మధ్య ప్రేమ.. వివాహ బంధంతో ఒకటైన జంట

ఇంగ్లాండ్‌ మహిళా జట్టు క్రికెటర్లు కేథరిన్‌ బ్రుంట్‌, నాట్‌ స్కీవర్‌ వివాహ బంధంతో ఒకటయ్యారు.......

Published : 30 May 2022 18:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ మహిళా జట్టు క్రికెటర్లు కేథరిన్‌ బ్రుంట్‌, నాట్‌ స్కీవర్‌ వివాహ బంధంతో ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వారాంతంలో పెళ్లి చేసుకున్నారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇంగ్లాండ్‌ మాజీ క్రీడాకారిణి ఇసా గుహా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. లవ్‌ యూ’ అంటూ అభినందించింది. ఈ జంటకు క్రికెట్‌ ఇంగ్లాండ్‌ శుభాకాంక్షలు తెలిపింది. అధికారిక ట్విటర్ ఖాతాలో వారి ఫొటోను పంచుకుంటూ.. ‘వారాంతంలో వివాహం చేసుకున్న కేథరిన్ బ్రంట్, నాట్ స్కీవర్‌లకు మా హృదయపూర్వక అభినందనలు’ అంటూ పేర్కొంది.

ఇంగ్లాండ్‌ జట్టు 2017 ప్రపంచకప్‌ గెలవడంతో ఈ ఇరువురు కీలక పాత్రపోషించారు. 2022 వరల్డ్‌కప్‌ జట్టు సభ్యులు కూడా. జట్టు వైస్‌ కెప్టెన్‌ అయిన స్కీవర్‌ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో చెలరేగింది. 148 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో ఆమె మొత్తంగా 436 రన్స్‌తో మూడో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 7 టెస్టులు, 89 వన్డేలు, 91 టీ20లు ఆడింది. సీనియర్‌ ప్లేయర్‌ అయిన కేథరిన్‌ బ్రుంట్‌ మొత్తంగా 14 టెస్టులు, 140 వన్డేలు, 96 టీ20ల్లో ఆడి 316 వికెట్లు పడగొట్టింది.

కేథరిన్‌ బ్రుంట్‌, నాట్‌ స్కీవర్‌ తరహాలోనే గతంలోనూ పలువురు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మరిజాన్నే కాప్‌, డేన్‌ వాన్‌ నీకెర్క్‌ ఉంగరాలు మార్చుకోగా.. న్యూజిలాండ్‌కు చెందిన ఏమీ సట్టెర్త్‌వైట్‌, ల్యూ తహుహు వివాహ బంధంతో ఒకటయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని