IND vs ENG: ఇంగ్లాండ్‌ ఓపెనర్లే కొట్టేశారు.. సెమీస్‌లో టీమ్‌ఇండియా చిత్తు

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ కథ ముగిసింది. సెమీస్‌ పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైన టీమ్ఇండియా పది వికెట్ల తేడాతో ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

Updated : 10 Nov 2022 18:27 IST

అడిలైడ్‌: మరోసారి 2007 టీ20 ప్రపంచకప్‌ పునరావృతమవుతుందని అంతా ఆశగా చూశారు. ఫైనల్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను చూడాలని వేయి కళ్లతో ఎదురు చూశారు. అనుకొన్నట్లుగానే పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరింది. ఇక భారత్‌ కూడా ఇంగ్లాండ్‌ను ఓడించి పాక్‌ను ఢీ కొడుతుందని భావించిన క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తూ.. ఇంగ్లాండ్‌ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకొని ఇంటిముఖం పట్టింది. 

రెండో సెమీస్‌లో భారత్‌పై ఇంగ్లాండ్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీ ఆసాంతం ఓ ఇద్దరు బ్యాటర్లపైనే ఆధారపడిన భారత్‌ను బౌలర్లు ఎలాగోలా కాపాడుతూ వచ్చారు. అయితే కీలకమైన మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లాండ్‌ వికెట్‌ తీయడానికి నానా తంటాలు పడ్డారు. ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేక చేతులెత్తేశారు. భారత్‌ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 16 ఓవర్లలోనే పూర్తి చేసేసింది. దీంతో నవంబర్ 13న మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే ఫైనల్‌లో పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్‌ తలపడనుంది. 

కొనసాగిన ఓపెనర్ల వైఫల్యం

గ్రూప్‌ స్టేజ్‌లో ఓపెనర్లు విఫలమైతే అభిమానులు సర్దుకుపోయారు. కీలకమైన నాకౌట్‌ దశలోనూ అదే ఆటతీరుతో మరోసారి నిరుత్సాహానికి గురి చేశారు. అడిలైడ్‌ మైదానం బ్యాటింగ్‌కు మరీ అనుకూలించనంత స్థాయిలో ఏమీలేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ (50), హార్దిక్‌ పాండ్య (63) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అలాగే రోహిత్ శర్మ (27) కూడా కుదురుకొన్నట్లే కనిపించాడు. కానీ మరోసారి తన బలహీనతను బయటపెట్టి అప్పనంగా ఇంగ్లాండ్‌కు వికెట్‌ను సమర్పించాడు. ఇదే కోవలోకి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) వస్తాడు. బౌండరీతో ఖాతా తెరిచిన రాహుల్‌ గత రెండు మ్యాచుల్లోని ఫామ్‌ను కొనసాగిస్తాడని అంతా భావించారు. అయితే ఓ చెత్త షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. మిస్టర్ 360 సూర్యకుమార్‌ ఓ రెండు షాట్లు కొట్టాడు కానీ.. ఇంగ్లాండ్‌ తెలివిగా బౌలింగ్‌ చేసి అతడిని కట్టడి చేసింది. పంత్ (6) కూడా పెద్ద ప్రభావం చూపలేదు. చివర్లో వచ్చి ధాటిగా ఆడలేకపోయాడు. విరాట్, పాండ్య ఆమాత్రం ఆడకపోతే భారత్‌ ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమై ఉండేది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ (4008 పరుగులు) అంతర్జాతయ టీ20ల్లో 4వేల మార్క్‌ను దాటిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

బౌలర్లు మరింత ఘోరం

ఇంగ్లాండ్‌ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (86*), జోస్ బట్లర్ (80*) ఎలా ఆడతారో తెలుసు. అయినప్పటికీ కనీసం వారిని అడ్డుకొనేలా బంతులను సంధించడంతో భారత పేసర్లు, స్పిన్నర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా లక్ష్య ఛేదనను పూర్తి చేసేశారు. అయితే రాకరాక వచ్చిన క్యాచ్‌ను భారత ఫీల్డర్లు విడిచిపెట్టడం దారుణం. పవర్‌ప్లేలోనే భారత్‌ ఓటమి దాదాపు ఖరారైనప్పటికీ.. కనీసం ఒక్క వికెట్‌ అయినా దక్కకపోదా..? అని చూసిన అభిమానులను నిరాశ తప్పలేదు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు రాణించిన పిచ్‌పై భారత్‌ స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4-0-30-0), అశ్విన్‌ (2-0-27-0) మాత్రం ప్రభావం చూపలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని