Updated : 15 Jul 2022 00:58 IST

IND vs ENG: రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ ఘన విజయం.. తేలిపోయిన భారత బ్యాట్స్‌మెన్

లార్డ్స్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఓటమిపాలైంది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 247 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 146 పరుగులకే కుప్పకూలింది. టోప్లే 6/24 నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. హార్దిక్‌ పాండ్య (29; 44 బంతుల్లో 2x4), రవీంద్ర జడేజా (29; 44 బంతుల్లో 1x4, 1x6), సూర్యకుమార్‌ యాదవ్‌ (27; 29 బంతుల్లో 1x4, 1x6), మహ్మద్‌ షమి (23; 28 బంతుల్లో 2x4, 1x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

ఆదిలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0), శిఖర్‌ ధావన్‌ (9), కోహ్లీ (16), పంత్‌ (0) పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో టీమ్‌ఇండియా 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య ఐదో వికెట్‌కు కాస్త పోరాడటంతో ఆశలు చెలరేగాయి. కానీ, వీరిద్దరూ 42 పరుగుల భాగస్వామ్యం జోడించాక టోప్లే మరోసారి చెలరేగాడు. అతడు సూర్యకుమార్‌ను బౌల్డ్‌ చేశాడు. కాసేపటికే పాండ్య సైతం మొయిన్‌ అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరడంతో భారత్‌ 101 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. తర్వాత జడేజా, పాండ్య ఏడో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. కానీ, వీరిద్దర్నీ టోప్లేనే మరోసారి విడదీశాడు. అతడు వేసిన 35వ ఓవర్‌ చివరి బంతికి షమి ఔటయ్యాడు. ఇక మరుసటి ఓవర్‌ తొలి బంతికే లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో జడేజా బౌల్డయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా 140 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరగా 39వ ఓవర్‌లో టోప్లే ఆఖరి రెండు వికెట్లు కూడా తీయడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమానంగా మారింది.

మెరిసిన చాహల్‌..

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 246 పరుగులకు ఆలౌటైంది. యుజ్వేంద్ర చాహల్‌ 4/47 అద్భుతమైన స్పెల్‌కు ఆ జట్టులోని కీలక ఆటగాళ్లు తేలిపోయారు. మొయిన్‌ అలీ (47; 64 బంతుల్లో 2x4, 2x6), డేవిడ్‌ విల్లే (41; 49 బంతుల్లో 2x4, 2x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు కీలకమైన 62 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. తొలుత ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (23; 33 బంతుల్లో 2x4, 1x6), జానీ బెయిర్‌ స్టో (38; 38 బంతుల్లో 6x4) మెరుగ్గా ఆరంభించినా ఇంగ్లాండ్‌ ఆకట్టుకోలేకపోయింది. హార్దిక్‌ పాండ్య తన తొలి ఓవర్‌లోనే జేసన్‌ రాయ్‌ను ఔట్‌చేసి టీమ్‌ఇండియాకు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. తర్వాత చాహల్‌ వరుసగా.. బెయిర్‌ స్టో, జో రూట్‌ (11), బెన్‌ స్టోక్స్‌ (21)లను ఔట్‌చేసి ఇంగ్లాండ్‌కు గట్టి షాకిచ్చాడు. ఈ క్రమంలోనే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (4)ను షమి బోల్తా కొట్టించాడు. దీంతో ఇంగ్లాండ్‌ 102 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

తర్వాత లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (33; 33 బంతుల్లో 2x4, 2x6), మొయిన్‌ అలీ పోరాడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించాక హార్దిక్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ ఔటయ్యాడు. తర్వాత మొయిన్‌ అలీ, విల్లే నిలకడగా ఆడి ఏడో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం జోడించారు. చివరికి అలీ సైతం చాహల్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. తర్వాత విల్లే టెయిలెండర్లతో కలిసి కాస్త ధాటిగా ఆడి ఇంగ్లాండ్‌కు మంచి స్కోర్‌ అందించాడు. టీమ్‌ఇండియా మిగతా బౌలర్లలో బుమ్రా, హార్దిక్‌ చెరో రెండు వికెట్లు తీయగా ప్రసిద్ధ్‌, షమి తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts