ఆసీస్‌కు షాకిచ్చి.. ఇంగ్లాండ్ కాలర్‌ ఎగరేసి 

క్రికెట్‌ పుట్టినిల్లుగా పేరున్న ఇంగ్లాండ్‌ ఐసీసీ టోర్నీల్లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది ఎప్పుడంటే ఎవరైనా 2019 వన్డే ప్రపంచకప్పునే గుర్తుచేసుకుంటారు. కానీ అంతకు తొమ్మిదేళ్ల ముందే ఆ జట్టు పొట్టి క్రికెట్‌లో విజేతగా నిలిచింది....

Published : 16 May 2021 09:33 IST

కాలింగ్‌వుడ్‌ నేతృత్వంలో తొలిసారి విశ్వవిజేత..

క్రికెట్‌ పుట్టినిల్లుగా పేరున్న ఇంగ్లాండ్‌ ఐసీసీ టోర్నీల్లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది ఎప్పుడంటే ఎవరైనా 2019 వన్డే ప్రపంచకప్పునే గుర్తుచేసుకుంటారు. కానీ అంతకు తొమ్మిదేళ్ల ముందే ఆ జట్టు పొట్టి క్రికెట్‌లో విజేతగా నిలిచింది. పాల్‌ కాలింగ్‌వుడ్‌ నేతృత్వంలో 2010 టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను చిత్తుచేసి తొలిసారి ఐసీసీ కప్పును ముద్దాడింది. అది జరిగి నేటికి 11 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నాటి విశేషాలు మీకోసం..


అదృష్టం కలిసొచ్చి..

నాటి ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌లో నిర్వహించారు. ఆ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొనగా నాలుగు గ్రూపులుగా విడదీసి లీగ్‌ మ్యాచ్‌లు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ గ్రూప్ డీలో.. వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ జట్లతో పోటీపడింది. అక్కడ ఒక్కో జట్టు మిగిలిన జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్‌ చేతిలో ఓటమిపాలైన ఇంగ్లాండ్‌ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఫలితం తేలలేదు. అయినా రన్‌రేట్ పరంగా ఐర్లాండ్‌ కన్నా మెరుగ్గా ఉండటంతో కాలింగ్‌వుడ్‌ టీమ్‌ సూపర్‌ 8కు అర్హత సాధించింది.


సూపర్‌ 8లో సూపర్‌..

ఇక గ్రూప్‌ దశ నుంచి సూపర్‌ 8కు అర్హత సాధించిన ఇంగ్లాండ్‌ ఇక్కడ పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లను అలవోకగా ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలుత పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 148 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. ఇక్కడ కెవిన్‌ పీటర్సన్‌(73 నాటౌట్‌ ; 52 బంతుల్లో 8x4, 2x6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆపై దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని కివీస్‌తో మూడో పోటీకి సిద్ధపడింది. ఈ మ్యాచ్‌లోనూ పీటర్సన్‌(53; 33 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకంతో రాణించాడు. ఇక న్యూజిలాండ్‌తో ఆడిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 150 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈసారి ఇయాన్‌ మోర్గాన్‌(40; 34 బంతుల్లో 4 x4, 1x6) ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్‌ టీమ్‌ సెమీస్‌కు చేరింది.


శ్రీలంకను కూల్చివేసి..

ఆపై సెమీ ఫైనల్లో లంకతో పోరాడిన కాలింగ్‌వుడ్‌ టీమ్‌.. ప్రత్యర్థిని 20 ఓవర్లలో 128/6 స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఇక్కడ ఏంజిలో మాథ్యూస్‌(58; 45 బంతుల్లో 3x4, 1x6) ఒక్కడే అర్ధశతకంతో ఆదుకోవడంతో శ్రీలంక ఆ మాత్రం స్కోరైనా చేసింది. లేదంటే దాని పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. చివరికి ఇంగ్లాండ్‌ స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో ఛేదించింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ క్రేగ్‌ కీస్వెటర్‌(39; 29 బంతుల్లో 5x4, 2x6), మైఖేల్‌ లంబ్‌(33; 26 బంతుల్లో 4x4, 1x6), పీటర్సన్‌(42 నాటౌట్‌; 26 బంతుల్లో 3x4, 2x6) దంచికొట్టడంతో సునాయాస విజయం సాధించింది. దాంతో ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడింది.


ఆసీస్‌ను మట్టికరిపించి..

చివరగా ఆస్ట్రేలియాతో తలపడిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఆడింది. ఈ పోరుకు ముందు అంతా ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని భావించినా ఇంగ్లాండే విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కంగారూలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగుల స్కోరు సాధించారు. టాప్‌ ఆర్డర్‌ చేతులెత్తేయగా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ హస్సీ(59; 54 బంతుల్లో 2x4, 2x6), కామెరూన్‌ వైట్‌(30; 19 బంతుల్లో 4x4, 1x6) ఆదుకున్నారు. ఛేదనలో క్రేగ్‌ కీస్వెటర్‌(63; 49 బంతుల్లో 7x4, 2x6), కెవిన్‌ పీటర్సన్‌(47; 31 బంతుల్లో 4x4, 1x6) మరోసారి దంచికొట్టడంతో ఇంగ్లాండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో కాలింగ్‌వుడ్‌ నేతృత్వంలో ఆ జట్టు మూడో పొట్టి ప్రపంచకప్‌ ముద్దాడింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని