
రూట్, బెయిర్‌స్టోను ఇలా ఉచ్చులో పడేశా
టీమ్ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ సారథి జోరూట్‌ను బోల్తా కొట్టించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని టీమ్ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. జానీ బెయిర్‌స్టోను సైతం చాలా తెలివిగా ఔట్ చేశానని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వారిద్దరిపై అమలు చేసిన వ్యూహాన్ని బయట పెట్టాడు. రూట్ ఎల్బీ అవ్వగా బెయిర్‌స్టో కూడా ఎల్బీ అయిన సంగతి తెలిసిందే.
‘రూట్‌కు ముందు నుంచీ క్రీజుకు దూరంగా బంతులు వేశాను. వాటికి అలవాటు పడేలా చేశాను. ఆ తర్వాత ఒక కొత్త ఓవర్ కోసం బంతి తీసుకున్నప్పుడు ఒక బంతి లోపలికి వేయాలనుకున్నా. అనుకున్నట్టుగా విసిరి ఔట్ చేశా. ప్రణాళికను కచ్చితత్వంతో అమలు చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సరదాగా అనిపించింది’ అని సిరాజ్ తెలిపాడు.
జానీ బెయిర్‌స్టో కోసమూ సిరాజ్ ఓ వ్యూహం సిద్ధం చేసుకున్నాడు. గంటకు 146 కి.మీ వేగంతో ఇన్‌స్వింగర్ విసిరి ఎల్బీ చేశాడు. ‘మొదట్లో బెయిర్ స్టోకు తక్కువ వేగంతో బంతులు వేశాను. ఆ తర్వాత అతడు ఇన్‌స్వింగర్లకు ఔటైన పుటేజీ చూశాక వ్యూహం మార్చాను. ఒక ప్రాంతంలో బంతులు వేయడం మొదలుపెట్టాను. క్రమంగా నిలకడగా లోపలికి వేయడం ఆరంభించాను. అది పనిచేసింది’ అని సిరాజ్ అన్నాడు.
రంజీ మ్యాచులు ఆడుతున్నప్పటి నుంచే మంచి ప్రాంతాల్లో బంతులు విసిరాలని నేర్చుకున్నానని సిరాజ్ తెలిపాడు. ఓపికతో ఉండటం అవసరమని వివరించాడు. ఏదో ఒక ప్రాంతంలో బంతులు వేసి ఒత్తిడి తేవాలని విరాట్ భాయ్ చెప్పాడన్నాడు. ఇషాంత్ భాయ్ సైతం వేర్వేరు ప్రాంతాల్లో విసరొద్దని, ఒత్తిడి పెంచితే వికెట్లు వాటంతట అవే వస్తాయని సూచించాడన్నాడు. రివర్స్ స్వింగ్ ఎక్కువగా రావడం లేదు కాబట్టి ఒక ఎండ్ నుంచే పేసర్లు బౌలింగ్ చేయాలని కోహ్లీ సూచించినట్టు సిరాజ్ వెల్లడించాడు.