Euro Cup 2024: స్పెయిన్‌తో ఫ్రాన్స్‌ సై

టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన జట్లలో ఉన్న స్పెయిన్‌ ఒకవైపు.. అతి తక్కువ గోల్స్‌ సాధించిన జట్లలో ఉన్న ఫ్రాన్స్‌ మరోవైపు. యూరో 2024లో రసవత్తర సమరానికి వేళైంది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

Published : 09 Jul 2024 02:41 IST

యూరో సెమీఫైనల్‌ నేడు
మ్యూనిచ్‌

టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన జట్లలో ఉన్న స్పెయిన్‌ ఒకవైపు.. అతి తక్కువ గోల్స్‌ సాధించిన జట్లలో ఉన్న ఫ్రాన్స్‌ మరోవైపు. యూరో 2024లో రసవత్తర సమరానికి వేళైంది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. రెండు జట్లూ క్వార్టర్స్‌లో అదనపు సమయానికి వెళ్లాయి. చివరి నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌ మెరినో గోల్‌తో స్పెయిన్‌ 2-1తో ఆతిథ్య జర్మనీపై గెలిస్తే.. గోల్స్‌ నమోదు కాని పోరులో ఫ్రాన్స్‌ షూటౌట్లో పోర్చుగల్‌పై నెగ్గింది.

ఎవరిదో పైచేయి..: ఫేవరెట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టిన ఫ్రాన్స్‌ ఇప్పటివరకు ఏమాత్రం అంచనాలకు తగ్గట్లు ఆడలేకపోయింది. కష్టపడుతూ సెమీస్‌ దాకా వచ్చింది. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క ఫ్రాన్స్‌ ఆటగాడు కూడా ఓపెన్‌ గోల్‌ కొట్టలేకపోవడం గమనార్హం. సెల్ఫ్‌ గోల్స్, ఎంబాపె పెనాల్టీ ద్వారా మాత్రం ఇప్పటివరకు ఫ్రాన్స్‌ స్కోరు చేసింది. కీలక ఆటగాడైన ఎంబాపె అంతగా ఫామ్‌లో లేకపోవడం ఫ్రాన్స్‌కు కష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లోనైనా అతడు సత్తా మేరకు రాణించాలని ఆ జట్టు కోరుకుంటోంది. ప్రస్తుతం ఫామ్‌ ప్రకారం చూస్తే స్పెయినే మెరుగ్గా కనపడుతోంది. నాలుగోసారి యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌పై కన్నేసిన ఆ జట్టు ఇప్పటివరకు 11 గోల్స్‌ కొట్టింది. గ్రూప్‌ దశలో అన్ని మ్యాచ్‌లూ గెలిచిన ఏకైక జట్టు అది. ఫ్రాన్స్‌ ఒక్కటి మాత్రమే నెగ్గి రెండింటిని డ్రాగా ముగించింది. అయితే రెండు జట్లు కూడా ప్రత్యర్థులకు ఎక్కువ గోల్స్‌ ఇవ్వలేదు. ఫ్రాన్స్‌ ఒక్క గోల్‌ మాత్రమే ఇవ్వగా.. స్పెయిన్‌ రెండే ఇచ్చింది. చరిత్ర చూస్తే స్పెయిన్‌దే కాస్త పైచేయి. ఈ జట్లు 36 మ్యాచ్‌ల్లో తలపడగా.. స్పెయిన్‌ 16 సార్లు, ఫ్రాన్స్‌ 13 సార్లు నెగ్గాయి. మిగతా మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. యూరోలో స్పెయిన్‌ ఆరుసార్లు సెమీస్‌ చేరగా.. ఫ్రాన్స్‌ అయిదుసార్లు సెమీస్‌లో అడుగుపెట్టింది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న జట్లలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.


కోపా సెమీస్‌లో  అర్జెంటీనా × కెనడా

రేపు ఉదయం 5.30 నుంచి

కోపా అమెరికాలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా బుధవారం తెల్లవారుజామున  జరిగే సెమీఫైనల్లో కెనడాను ఢీకొంటుంది. కోపాలో సెమీస్‌ ఆడడం కెనడాకు ఇదే తొలిసారి. గురువారం తెల్లవారుజామున జరిగే మరో సెమీఫైనల్లో ఉరుగ్వే, కొలంబియా తలపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని