T20 League: ప్రతి జట్టుకు రషీద్‌ ఖాన్‌లాంటి ఆటగాడు అవసరం: సంజయ్‌ మంజ్రేకర్

భారత టీ20 లీగ్‌ 2023 సీజన్ కోసం ఆటగాళ్ల కోసం వేలానికి సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో ఈ-వేలం ప్రారంభం కానుంది. 87 స్థానాల కోసం 405 మంది ఆటగాళ్లు బరిలోకి నిలిచారు. డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. 

Updated : 20 Dec 2022 17:51 IST

ఇంటర్నెట్ డెస్క్: మరో మూడు రోజుల్లో భారత టీ20 లీగ్‌ మినీ వేలం జరగనుంది. బెన్ స్టోక్స్, ఆడమ్ జంపా, మయాంక్‌ అగర్వాల్‌, కేన్ విలియమ్సన్‌ వంటి స్టార్లను ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో వారంతా వేలంలోకి వచ్చేశారు. దీంతో కీలక ఆటగాళ్లను దక్కించుకొనేందుకు పోటీ పడే అవకాశం ఉంది. పంజాబ్‌, హైదరాబాద్ జట్ల వద్ద ఎక్కువ సొమ్ము ఉండటం విశేషం. ఈ క్రమంలో అన్ని జట్లూ ఉత్తమ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తాయని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. మరీ ముఖ్యంగా ముంబయి ఫ్రాంచైజీ బౌలర్లను తీసుకొనేందుకు దృష్టి పెడుతుందని స్పష్టం చేశాడు.

‘‘గత సీజన్‌లో సరైన బౌలింగ్‌ దాడి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడింది. అయితే ఈసారి బుమ్రాతోపాటు జొఫ్రా ఆర్చర్‌ కూడా వచ్చేస్తాడు. అలాగే జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ కూడా ఉండటం పేస్‌ బౌలింగ్‌ పటిష్టంగా అనిపిస్తోంది. రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే ప్రతి ఫ్రాంచైజీ కూడా రషీద్‌ ఖాన్‌ లాంటి లెగ్‌ స్పిన్నర్‌ను తీసుకోవడానికి మొగ్గు చూపుతోంది. కాబట్టి ముంబయి కూడా ఇలానే ఆలోచించే అవకాశం లేకపోలేదు ఇప్పటికే జట్టులో మార్కండే ఉన్నప్పటికీ.. జంపా, అదిల్ రషీద్‌ వంటి అంతర్జాతీయ స్పిన్నర్‌ను తీసుకోవచ్చు’’ అని సంజయ్‌ తెలిపాడు. 

పెద్ద ఆటగాళ్లపైనే..

‘‘పంజాబ్‌, హైదరాబాద్‌ తప్పకుండా పెద్ద ఆటగాళ్లపై గురి పెడతాయి. మిగతా టీమ్‌లతో పోలిస్తే ఈ రెండింటిలో కూర్పు సరిగా లేదు. మ్యాచ్‌లో ఆడే తుది 11 మంది కూడా లేకపోవడం గమనార్హం. భారీగా సొమ్ము ఉంది కాబట్టి కాస్త దూకుడుగా ఆడేవారిపై పెట్టుబడి పెట్టే అవకాశం లేకపోలేదు. అలాగే ఆడమ్ జంపా కోసం తీవ్ర పోటీ ఉంటుంది. కేన్‌ విలియమ్సన్‌ను హైదరాబాద్‌ వదిలేసుకోవడంతో సరైన ఓపెనర్‌ కోసం అన్వేషించాల్సిన పరిస్థితి. అందుకే మయాంక్‌ అగర్వాల్‌ వైపు మొగ్గు చూపడం ఖాయం. ఎలాంటి బెరుకు లేకుండా, దూకుడుగా, స్వేచ్ఛగా మయాంక్‌ ఆడతాడు. అదేవిధంగా నాయకత్వ బాధ్యతలకు అక్కరకొస్తాడు. పంజాబ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది’’ అని భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని