Gautham gambhir: భారత టీ20 లీగ్‌పై అలాంటి ఆరోపణలు సరికాదు: గౌతమ్‌ గంభీర్‌

భారత టీ20 లీగ్‌ వల్లే భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో రాణించలేకపోతున్నారనే వ్యాఖ్యలతో తాను విభేదిస్తానని గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు.

Updated : 27 Nov 2022 11:37 IST

దిల్లీ: భారత టీ20 లీగ్‌ వల్లే భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో రాణించలేకపోతున్నారనే వ్యాఖ్యలతో తాను విభేదిస్తానని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చిన ఈ లీగ్‌పై ఇటువంటి ఆరోపణలు తనను బాధిస్తున్నాయన్నాడు. ఎఫ్‌ఐసీసీఐ, ప్రధాన క్రీడల విభాగం ఛైర్‌పర్సన్‌ సన్‌జోగ్‌ గుప్తా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న అనంతరం గంభీర్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘భారత టీ20 లీగ్‌ రాకతో మన దేశంలో క్రికెట్‌కు గొప్ప మేలు జరిగింది. ఈ లీగ్‌ ప్రారంభమైన సమయం నుంచే దీనిపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఐసీసీ టోర్నమెంట్లలో బాగా ఆడలేకపోతే అందుకు బాధ్యులను చేయాల్సింది ఆటగాళ్లను, వారి ప్రదర్శనను. కానీ టీమ్‌ఇండియా వైఫల్యం చెందిన ప్రతిసారి అంతా ఈ లీగ్‌నే తప్పుపడుతుంటారు. అది సరైంది కాదు. ఒక క్రీడాకారుడు 35-36 ఏళ్ల వయసు వరకే సంపాదించగలడు. వారికి ఆర్థిక భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యం. అది టీ20 లీగ్‌ కారణంగా తీరుతుంది. దీని ద్వారా పొందే ఆదాయం అట్టడుగు స్థాయి నుంచి వారి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోంది‘‘ అంటూ వివరించాడు. 

అదే సమయంలో భారత టీ20 లీగ్‌లో స్వదేశీ కోచ్‌ల అవసరాన్ని వివరిస్తూ.. ‘‘ ప్రస్తుతం టీమ్‌ఇండియాలో భారత కోచ్‌లకు సరైన ప్రాధాన్యం ఇస్తూ బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. భారత జట్టుకు కోచ్‌గా భారతీయుడే ఉండాలని నేను బలంగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ ఆట ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నది. దానిని అనుభూతి చెందిన వారే జట్టును సమర్థంగా నడిపించగలరు. లఖ్‌నవూ జట్టు మెంటార్‌గా.. ఈ లీగ్‌లో అన్ని జట్లకు భారతీయ కోచ్‌లే ఉండటం నేను చూడాలనుకుంటున్నా. మనం విదేశీ కోచ్‌లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. కానీ వారు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే ఇక్కడకు వస్తుంటారు. మన ఆటగాళ్లకు బిగ్‌ బాష్‌ వంటి ఇతర విదేశీ లీగ్‌ల్లో కోచ్‌ బాధ్యతలు అప్పగించరు. క్రికెట్‌లో భారత్‌ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. మనవారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి’’అంటూ తెలిపాడు. బీసీసీఐ తన నిధుల నుంచి 50 శాతాన్ని ఇతర ఒలింపిక్‌ క్రీడల కోసం వెచ్చించాలని కోరాడు. ఒడిశా అనుసరిస్తున్నట్టుగా ఏదైనా ఒక క్రీడను దేశం తరఫున ముందుకు తీసుకెళ్లాలని ఈ మాజీ క్రికెటర్‌ సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని