IPL 2023: ఐపీఎల్ @ 1000.. అందుకు ఎంతో సంతోషంగా ఉంది: సచిన్‌ తెందూల్కర్‌

ఐపీఎల్‌ (IPL) ఓ కీలక మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం 16వ సీజన్‌ కొనసాగుతున్న వేళ.. ఆదివారం ముంబయి - రాజస్థాన్‌ మ్యాచ్‌తో అరుదైన మార్క్‌ను తాకింది.

Updated : 01 May 2023 12:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆదివారం ముంబయి -రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఓ విశేషం ఉందని అందరికీ తెలిసిందే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 1000వ మ్యాచ్‌ ఇది. 2008లో ప్రారంభమైన మెగా టోర్నీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముంబయి మాజీ కెప్టెన్‌ సచిన్‌, రాజస్థాన్‌ కోచ్‌ కుమార సంగక్కరను ఐపీఎల్ నిర్వాహకులు ప్రత్యేకంగా సత్కరించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా చేతుల మీదుగా మెమొంటోను అందించారు. అలాగే ప్రస్తుతం ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, రాజస్థాన్‌ సారథి సంజూ శాంసన్‌కూ ప్రత్యేకంగా షీల్డ్‌ను అందించారు. 

సచిన్‌ తెందూల్కర్‌ ముంబయి తరఫున ఆరు సీజన్లలో 78 మ్యాచ్‌లు ఆడాడు. ఒక శతకం, 13 అర్ధశతకాలతో 2,334 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2010 సీజన్‌లో సచిన్‌ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. అప్పుడే 15 మ్యాచుల్లో 618 పరుగులు సాధించి ‘ఆరెంజ్‌’ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ముంబయి మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. సచిన్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ కూడా ఇదే ఏడాది ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయడం గమనార్హం. 

రాజస్థాన్‌ క్రికెట్‌ డైరెక్టర్‌, కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర కూడా తొలి సీజన్‌లో ఆడిన కీలక ప్లేయర్. మొత్తం 71 మ్యాచులు ఆడిన సంగక్కర 1,687 పరుగులు చేశాడు. అత్యధిక అత్యుత్తమ స్కోరు 94. పంజాబ్‌ కింగ్స్‌, డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీలకు ఆడాడు. పది హాఫ్ సెంచరీలను సాధించిన సంగక్కర తొలి సీజన్‌లోనే (2008) 320 పరుగులు చేసి అబ్బురపరిచాడు. 

ఆ మైలురాయిని చేరుకోవడం అద్భుతం: సచిన్‌

‘‘ఐపీఎల్‌ చరిత్రలో 1000వ మ్యాచ్‌ను చూడటం ఎంతో ప్రత్యేకం. ఆ మైలురాయిని చేరుకోవడం అద్భుతంగా ఉంది. కాలం చాలా వేగంగా ముందుకు సాగుతున్నట్లనిపించింది. ఇంతటి భారీ టోర్నీని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్న బీసీసీఐకి ప్రత్యేక అభినందనలు. లీగ్‌ వృద్ధి చెందిన విధానం మాటల్లో వర్ణించలేనిది. తొలి సీజన్‌ నుంచే భాగమైనందుకు ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే భారీ టోర్నీ అయిన ఐపీఎల్‌ ద్వారా చాలా మంది క్రికెటర్లకు అవకాశాలు లభించాయి. మరీ ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఛాన్స్‌లు రావడం మనందరం చూస్తున్నాం’’అని సచిన్ తెలిపాడు.
Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని