Ricky Ponting: రికీ పాంటింగ్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు కామెంట్రీ ఇస్తూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అస్వస్థతకు గురయ్యాడు.

Updated : 02 Dec 2022 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్‌ కామెంట్రీ చేస్తూ అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆస్ట్రేలియా మీడియా సంస్థలు వెల్లడించాయి. పాంటింగ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.

పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆటకు ఛానెల్‌ 7 తరఫున పాంటింగ్‌ కామెంటటేర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు 40 నిమిషాల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించిన 47 ఏళ్ల పాంటింగ్‌.. లంచ్‌ విరామం సమయంలో కామెంట్రీ బాక్స్‌ నుంచి వేగంగా బయటకు వెళ్లారని ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించాయి. పాంటింగ్‌ వెంట ఆయన స్నేహితుడు, ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ కూడా ఉన్నారు. ఛాతిలో నొప్పితో అసౌకర్యంగా ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా ఆసుప్రతిలో చేరినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

1999 నుంచి 2007 వరకు ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో పాంటింగ్‌ భాగస్వామిగా ఉన్నాడు. 2006, 2009లో పాంటింగ్‌ నేతృత్వంలో ఆసీస్‌ వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌ ట్రోఫీ సాధించింది. ప్రస్తుతం అతడు భారత టీ20 మెగా లీగ్‌లో దిల్లీ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని