IND vs AUS: ఇలాగే కొనసాగితే.. వారిద్దరి భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్లే: హాగ్‌

సీనియర్లు అనుభవంతో జట్టుకు అండగా నిలవాలి. కానీ, భారత క్రికెటర్లు పుజారా, విరాట్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో వారి టెస్టు క్రికెట్‌ భవిష్యత్‌పై నీలినీడలు అలుముకున్నట్లేనని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ వ్యాఖ్యానించాడు.

Published : 09 Mar 2023 12:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న భారత్ - ఆసీస్‌ (IND vs AUS) టెస్టు సిరీస్‌ బ్యాటర్లకు ఏమాత్రం కలిసిరాలేదు. అయితే, భారత సీనియర్లు విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. పుజారా అయినా ఓ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. కానీ, విరాట్ (Virat Kohli) మాత్రం పూర్తిగా విఫలం కావడం గమనార్హం. ఈ క్రమంలో వీరి టెస్టు భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. యువ బ్యాటర్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వేళ కీలక ఇన్నింగ్స్‌లు ఆడితేనే స్థానంపై భరోసా ఉంటుందని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కూడా ఇదే రకంగా స్పందించాడు. వీరిద్దరిపై జట్టు మేనేజ్‌మెంట్‌ నిఘా పెట్టి ఉండే ఉంటుందని వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లవుతోంది. అయితే, ఐపీఎల్‌ 2023 16వ సీజన్‌ తర్వాత విరాట్ తన మునుపటి ఫామ్‌లోకి వస్తాడని హాగ్‌ తెలిపాడు. 

‘‘ప్రస్తుతం భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవ లేదు. అయితే, సీనియర్లు పుజారా (Pujara), విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. వన్డేలు, టీ20ల్లో రాణించినప్పటికీ.. టెస్టుల్లో శతకం కోసం విరాట్‌కు నిరీక్షణ తప్పడంలేదు. ఇక పుజారా కూడా గొప్ప ఫామ్‌లో లేడు. భారీ స్కోర్లను మలచడంలో విఫలమవుతున్నాడు. అయితే, వీరిద్దరూ అద్భుతమైన టాలెంట్‌ ఉండి అనుభవం కలిగిన ఆటగాళ్లు. ఐపీఎల్ సీజన్‌ తర్వాత విరాట్ పుంజుకుంటాడని భావిస్తున్నా’’ 

‘‘ఒకవేళ విరాట్, పుజారా ఫామ్‌ అందుకోలేకపోతే తప్పకుండా వారి స్థానాల్లో యువ క్రికెటర్లకు అవకాశం రావచ్చు.  ఇటీవల దేశీయ క్రికెట్‌లో అదరగొట్టిన సర్ఫరాజ్‌ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంటారని అనుకుంటున్నా. కానీ, ఇప్పటికే చోటు కోసం ఎదురు చూస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌నే (Surya Kumar Yadav) తొలుత తీసుకునేందుకు అవకాశం ఉంది. సర్ఫరాజ్‌ అద్భుతమైన టాలెంట్‌ ఉన్న ఆటగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, అతడు ఇంకా తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దేశీయ క్రికెట్‌లో రాణించాడు. అలాగే ఐపీఎల్‌లోనూ తన సత్తా ఏంటో చూపిస్తే జట్టులో స్థానం దక్కడం మరింత సులభమవుతుంది’’ అని హాగ్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని