IPL 2023: శుభ్‌మన్‌ గిల్‌ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్‌

రెండు సీజన్ల కిందట వరకు కోల్‌కతా తరఫున ఆడిన శుభ్‌మన్‌ గిల్‌ను (Shubman Gill)ను ఆ ఫ్రాంచైజీ వదిలేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌కు (Gujarat Titans) ప్రాతినిధ్యం వహిస్తూ చెలరేగిపోతున్నాడు. జీటీ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

Published : 29 May 2023 18:49 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ 851 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతడి వద్దే ఆరెంజ్‌ క్యాప్‌ కూడా ఉంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్‌ (CSK vs GT) జట్ల మధ్య ఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ ప్రదర్శనతో పనిలేకుండానే ఆరెంజ్‌ క్యాప్‌ అతడి సొంతమైపోతుంది. కానీ, ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు సాధించి 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని సమం చేయాలంటే గిల్‌కు ఇంకా 122 పరుగులు అవసరం. అతడి ఫామ్‌ను చూస్తే కొట్టేయగలడనిపిస్తోంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌ మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత స్కాట్ స్టైరిస్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాలుగేళ్లపాటు గిల్‌ను తమతో ఉంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 2022 మెగా ఆక్షన్‌కు ముందు విడిచి పెట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్‌ భారీ మొత్తం (రూ. 8 కోట్లు) వెచ్చించి మరీ దక్కించుకుంది. వరుసగా రెండు సీజన్లలోనూ గుజరాత్ ఫైనల్‌కు చేరుకోవడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. 

‘‘కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ చేసిన అతిపెద్ద తప్పిదం ఇదే. శుభ్‌మన్‌ గిల్‌ను వదిలేసి పొరపాటు చేసింది. ఇలాగే ఆర్‌సీబీ కూడా కేఎల్‌ రాహుల్‌ను వదిలేసుకుంది. అయితే, రాహుల్‌ విషయంలో వయసు ప్రభావం చూపి ఉంటుంది. కానీ, గిల్ ఇంకా యువకుడే. అతడి ఆటలో చాలా మెరుగుదల కనిపిస్తోంది. ఇప్పుడు కేవలం గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకే కాదు. ప్రత్యేకించి వచ్చే ప్రపంచకప్‌లోనూ గిల్ ప్రభావం భారీగా ఉంటుంది. భారత జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడు. అతడు ఆ స్థానాన్ని స్వీకరిస్తాడని భావిస్తున్నా’’ అని స్టైరిస్‌ తెలిపాడు. 

భారత జట్టు తరఫున తొలుత వన్డేల్లోకి (2019) అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకే కేవలం 24 మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. ఇందులో డబుల్ సెంచరీ (208 పరుగులు) సాధించిన పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లోనూ (2020) 15 మ్యాచుల్లోనే 57.84 స్ట్రైక్‌రేట్‌తో 890 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే టీ20ల్లోకి డెబ్యూ చేసిన గిల్ ఇప్పటి వరకు కేవలం 6 మ్యాచుల్లోనే ఆడి 202 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‌ 2023తో పాటు వచ్చే సంవత్సరం జరిగే టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో గిల్ కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్ విశ్లేషకుల అంచనా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని