Team India: ఐపీఎల్ వల్లే.. భారత పేసర్లు రాటుదేలారు: ఆశిష్‌ నెహ్రా

భారత పేసర్లు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఆడటం వల్ల బౌలింగ్‌లో పదును పెరిగిందని మాజీ ఆటగాడు ఆశిష్‌ నెహ్రా అన్నాడు. అందుకే విదేశీ పిచ్‌లపై కూడా మెరుగ్గా రాణించి..

Published : 02 Jan 2022 01:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత పేసర్లు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఆడటం వల్ల బౌలింగ్‌లో పదును పెరిగిందని మాజీ ఆటగాడు ఆశిష్‌ నెహ్రా అన్నాడు. అందుకే విదేశీ పిచ్‌లపై కూడా మెరుగ్గా రాణించి.. టీమ్‌ఇండియా విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత పేస్‌ దళం 18 వికెట్లు పడగొట్టడం గమనార్హం. మహమ్మద్‌ షమీ 8, జస్ప్రీత్ బుమ్రా 5, మహమ్మద్‌ సిరాజ్‌ 3, శార్దూల్ ఠాకూర్‌ 2 వికెట్లు పడగొట్టారు.

‘భారత్‌ సాధించిన విజయం పట్ల చాలా సంతోషంగా ఉంది. గతంలో ఐపీఎల్ లేదు. దేశవాళీ మ్యాచులు కూడా చాలా తక్కువగా జరిగేవి. కానీ, ప్రస్తుతం ఐపీఎల్‌ భారత క్రికెట్‌ను పూర్తిగా మార్చేసింది. ఆటగాళ్ల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచింది. ఇషాంత్‌ శర్మ, ఉమేశ్ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి సీనియర్లతో పాటు ఎంతో మంది యువ బౌలర్లతో భారత పేస్‌ దళం పటిష్టంగా తయారైంది. ఆటగాళ్లు గాయాలపాలైనా.. వారి స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా మంది బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అలాగే, భారత జట్టు ఇటీవల తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తోంది. 2018 నుంచి ఇప్పటి వరకు టీమ్‌ఇండియా రెండేసి సార్లు.. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో పర్యటించింది. దీంతో బౌలర్లు విదేశీ పిచ్‌లకు బాగా అలవాటు పడ్డారు. షమి, బుమ్రా ఫ్లాట్ వికెట్లపై కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. గతంలో 4-5 సంవత్సరాలకు ఒకసారి విదేశీ పర్యటనలుండేవి. దీంతో ఆటగాళ్లు పిచ్‌ను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టేది’ అని ఆశిష్‌ నెహ్రా పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని