SKY: సూర్యకుమార్‌ లేని మూడు ఫార్మాట్లను ఊహించడం కష్టమే: సురేశ్‌ రైనా

టీమ్‌ఇండియా (Team India) సంచలన బ్యాటర్ సూర్యకుమార్‌ (Surya Kumar Yadav). టీ20ల్లో అదరగొట్టిన సూర్య.. వన్డేల్లో ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు టెస్టుల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైపోయాడు. 

Published : 26 Jan 2023 12:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా సూర్యకుమార్‌ను ఐసీసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్‌లోనే కాకుండా వన్డేల్లో కూడా ఆడుతున్న సూర్యకుమార్‌.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ చోటు దక్కించుకొన్నాడు. అయితే, తుది జట్టులోనూ అతడికి స్థానం కల్పించాలని డిమాండ్లూ వచ్చాయి. రిషభ్‌ పంత్ లేని లోటును తీరుస్తాడని క్రికెట్ పండితులు విశ్లేషించారు. తాజాగా సూర్యకుమార్ ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా అభినందనలు కురిపించాడు. సూర్యకుమార్‌ లేకపోతే మూడు ఫార్మాట్లు కూడా ఉండవని వ్యాఖ్యానించాడు. 

‘‘సూర్యకుమార్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అతడు బరిలోకి దిగాలి. సూర్య ఆడే విధానం బాగుంది. విభిన్న షాట్లను ఆడాలనే అతడి ప్లానింగ్‌ సూపర్. ఎటువంటి భయం లేకుండా మైదానం నలువైపులా షాట్లు కొడతాడు. అతడు ముంబయి జట్టులో ఉన్నాడు. కాబట్టి రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో ఎలా ఆడాలో అతడికి తెలుసు. ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇదొక అద్భుత అవకాశం. టెస్టు క్రికెట్‌ ఆడటం వల్ల వన్డేల్లోనూ రాణించేందుకు అవకాశం ఉంది. తప్పకుండా సెంచరీలు, ద్విశతకాలు సాధించగలడు’’ అని సురేశ్‌ రైనా తెలిపాడు. 

రైనా వ్యాఖ్యలతో మరో మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్‌ ఓజా ఏకీభవించాడు. ‘‘అవును. సూర్యకుమార్‌ తప్పకుండా టెస్టుల్లో ఆడాలి. అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. మూడు ఫార్మాట్లలోనూ సూర్య ఆడితే బాగుంటుంది. అయితే, ఇలాంటి చర్చ రావడానికి ప్రధాన కారణం సర్ఫరాజ్‌ ఖాన్. రంజీల్లో అదరగొట్టాడు. సూర్య టెస్టు జట్టులో ఉండేందుకు వందశాతం అర్హత ఉంది’’ అని ఓజా పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని