IND vs AUS: అతడు లేనందుకు నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి..

సరిగా ఆడినా ఆడకపోయినా కొందరు జట్టులోఉంటే  చాలు విజయాలు వచ్చేస్తాయి. ఇదే సూత్రం కేఎల్ రాహుల్ (KL Rahul)కు వర్తిస్తుందేమో.. తొలి రెండు టెస్టుల్లో అతడు సరైన ప్రదర్శన ఇవ్వకపోయినా.. టీమ్‌ఇండియా విజయం సాధించింది.

Published : 05 Mar 2023 20:00 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు టెస్టుల్లోనూ విఫలం కావడంతో మూడో టెస్టుకు (IND vs AUS) అతడిని దూరం పెట్టారు. తీరా తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన జట్టు.. ఒక్కసారిగా మూడో టెస్టులో ఓటమిపాలైంది. ఇంతకీ ఆ జట్టు టీమ్‌ఇండియా (Team India) కాగా.. ఆ ఆటగాడు ఎవరనేదేగా..? మీ డౌటు.. అతడెవరో కాదు భారత స్టార్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ (KL Rahul). బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy) బ్యాటింగ్‌లో విఫలమై విమర్శలపాలైన రాహుల్‌ను ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పక్కనపెట్టేసింది. శుభ్‌మన్‌ గిల్‌ను తీసుకోగా.. అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించలేదు.  ఈ మ్యాచ్‌లోనూ రాహుల్‌ ఆడి విఫలమై ఉంటే మరిన్ని విమర్శలు వచ్చేవి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్  శ్రీకాంత్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఆసీస్‌తో మూడో టెస్టులో కేఎల్ రాహుల్ ఆడకపోవడం మంచిదైంది. ఒకవేళ అతడు ఆడి ఉండి.. ఇలాంటి పిచ్‌ మీద విఫలమై ఉంటే మాత్రం టెస్టు కెరీర్‌కు ముగింపు పడే ప్రమాదం ఉంది. అందుకే మూడో టెస్టులో అతడు లేనందుకు నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే  ఇందౌర్‌ పిచ్‌ మీద బ్యాటింగ్‌ చాలా కష్టం. అలాంటి వికెట్‌ మీద విరాట్‌ కోహ్లీ వంటి టాప్‌ బ్యాటర్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డాడు. ఆసీస్ బౌలర్‌ కునెమన్‌ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ విధానం అద్భుతం. అయితే, ఇలాంటి పిచ్‌ మీద వికెట్‌ తీయడం పెద్ద కష్టమేంకాదు. నేను వేసినా వికెట్లు వస్తాయి’’ అని క్రిష్ తెలిపాడు. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ప్రారంభమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని