T20 League: ఏడాదికి రెండు టీ20 లీగ్‌ సీజన్లు.. భారత మాజీ కోచ్‌ ఏమన్నాడంటే..?

అంతర్జాతీయ స్థాయిలో దేశీయ టీ20 లీగ్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న కాలంలో ఏడాదికి...

Published : 29 Jul 2022 02:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ స్థాయిలో దేశీయ టీ20 లీగ్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న కాలంలో ఏడాదికి రెండు భారత టీ20 లీగ్‌ల సీజన్‌లను వీక్షించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అయితే ఆ రెండు లీగ్‌లు వేర్వేరుగా ఉంటాయని తెలిపాడు. ఇప్పుడు జరుగుతున్న విధంగానే పూర్తిస్థాయిలో ఒక లీగ్‌ ఉంటుందని, అలానే ఎక్కువ నాకౌట్‌ రౌండ్లతో రెండో సీజన్‌ జరిగే అవకాశం ఉందని వివరించాడు. ఇదంతా ద్వైపాక్షిక సిరీస్‌లను కుదించడంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు.

‘‘త్వరలోనే రెండు భారత టీ20 లీగ్‌లను మీరు చూడబోతున్నారని అనిపిస్తోంది. నాకైతే ఆశ్చర్యమేమీలేదు. అయితే ఇప్పుడున్న ఫార్మాట్‌ ప్రకారంగానే పూర్తిస్థాయి సీజన్‌ ఉంటుంది. పది లేదా పన్నెండు జట్లతో దాదాపు రెండున్నర నెలలు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒకవేళ ద్వైపాక్షిక సిరీస్‌లను తగ్గిస్తే మాత్రం భారత టీ20 లీగ్‌ రెండో సీజన్‌ వచ్చే అవకాశం ఉంది. అదీనూ నాకౌట్‌ రౌండ్లలో టైటిల్‌ కోసం జట్లు తలపడతాయి. ప్రపంచకప్‌ ఫార్మాట్ ఎలాగైతే ఉంటుందో ఆ పద్ధతిలో నిర్వహించే ఛాన్స్‌లు ఉన్నాయి. మనీ, సప్లై, డిమాండ్‌ సూత్రం ప్రకారం సాధ్యమవుతుందని భావిస్తున్నా. ఎందుకంటే ప్రస్తుతం ఆ స్థాయిలో టీ20 ఫార్మాట్‌కు డిమాండ్‌ ఉంది’’ అని రవిశాస్త్రి వివరించాడు. భారత టీ20 లీగ్‌ వల్ల కేవలం ఆటగాళ్లు, బోర్డులకే కాకుండా అనుబంధంగా ఉన్నవారికి ఎంతో ప్రయోజనంగా మారిందని అభిప్రాయపడ్డాడు. బ్రాడ్‌కాస్టర్స్‌, జట్టు సహాయక సిబ్బంది, ఆతిథ్య రంగం.. తదితర విభాగాలు వృద్ధి చెందాయని రవిశాస్త్రి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని