Virat Kohli : విరాట్‌ను ఆ స్థానంలో తప్పకుండా చూస్తాం: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు

టీ20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో బిజీబిజీగా ఉన్న టీమ్‌ఇండియా అంతకుముందే ఆసియా కప్‌ను ఆడనుంది. ఆసియా కప్‌ ముగిసిన..

Published : 05 Aug 2022 10:25 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో బిజీబిజీగా ఉన్న టీమ్‌ఇండియా అంతకుముందే ఆసియా కప్‌ను ఆడనుంది. ఆసియా కప్‌ ముగిసిన నెల రోజుల వ్యవధిలోనే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. పొట్టి ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక కావాలంటే ఆసియా కప్‌ ప్రదర్శనే ఆటగాళ్లకు గీటురాయిగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని రోజులుగా టీ20లను ఆడుతున్న యువఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. అయితే సీనియర్‌ బ్యాటర్, మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫామ్‌ కోసం తంటాలు పడుతున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో విఫలమైన కోహ్లీకి విండీస్‌తో సిరీస్‌కు సెలెక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఆసియా కప్‌ కోసం జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. కోహ్లీ ఫామ్‌ ప్రకారం సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుందా.. లేదా అనే అనుమానాలు అతడి అభిమానుల్లో ఉన్నాయి. అయితే కోహ్లీని తప్పకుండా ఆసియా కప్‌లో చూస్తామని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు పార్థివ్‌ పటేల్ మాత్రం నమ్మకంగా చెబుతున్నాడు.

‘‘విరాట్ కోహ్లీ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు లేవు. ఫామ్‌ కోల్పోవడం తాత్కాలికం. ఇక అతడు ఏ స్థానంలో ఆడతాడనే దానిపైనా చర్చ కొనసాగుతోంది. అందుకే ఆసియా కప్‌ చాలా కీలకం. ఇది విరాట్‌కు మాత్రమే కాకుండా జట్టుకు కూడా ముఖ్యమైన టోర్నమెంట్. ఇక్కడే  బ్యాటింగ్‌ లైనప్‌ను సరి చూసుకునే అవకాశం ఉంటుంది. టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే ముందు ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలనే దానిపై అవగాహన కోసం ఆసియా కప్‌ను వేదికగా చేసుకోవాలి. కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత నేపథ్యంలో రోహిత్ శర్మతో విరాట్‌ కోహ్లీని ఓపెనర్‌గా చూడొచ్చు. ఆసియా కప్‌నకు అందుబాటులో ఉంటానని ఇప్పటికే విరాట్ చెప్పాడు. అయితే రోహిత్-కోహ్లీ జోడీనే కాకుండా ఇంకా కొత్త ఓపెనింగ్ బ్యాటర్లను చెక్‌ చేసే అవకాశం లేకపోలేదు. భారత టీ20 లీగ్‌లో విరాట్ కోహ్లీ బెంగళూరు తరఫున చాలా మ్యాచుల్లో ఓపెనింగ్‌ చేశాడు’’ అని పార్థివ్‌ వివరించాడు. ఆగస్ట్ 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని