IND vs AUS: ఇయాన్‌ హీలీ ‘పిచ్‌’ వ్యాఖ్యలకు జాన్‌ రైట్ కౌంటర్‌..

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య (IND vs AUS) టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమవుతోంది. మరో నాలుగు రోజుల్లోనే టెస్టు (INDIA vs AUSTRALIA) సమరం మొదలుకానుంది. దీంతోపాటు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Updated : 05 Feb 2023 11:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నాలుగు టెస్టుల సిరీస్‌ దగ్గరపడటంతో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) ఆటగాళ్లతోపాటు మాజీల వ్యాఖ్యల వేడి రాజుకొంటోంది. ఇప్పటికే ఆసీస్‌ నుంచి స్టీవ్‌ స్మిత్, లబుషేన్, ఇయాన్ హీలీ, గ్రెగ్ ఛాపెల్‌ వంటి వారు తమ వ్యూహాలకు పదునుపెట్టారు. పిచ్‌లు, జట్టు బలాలు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్‌ (Team India) నుంచి కూడా రవిచంద్రన్ అశ్విన్, సునీల్ గావస్కర్, ఇర్ఫాన్‌ పఠాన్, మహమ్మద్ కైఫ్ కూడా ఘాటుగానే స్పందించారు. తాజాగా ఇయాన్ హీలీ ‘సమతూకమైన పిచ్‌’ కామెంట్లపై టీమ్ఇండియా మాజీ కోచ్ జాన్‌ రైట్‌ (John Wright) స్పందించడం విశేషం. ఆతిథ్యమిచ్చే దేశాలు తమకు అనుకూలంగానే పిచ్‌లను  తయారు చేయించుకోవడం సర్వసాధారణమైన విషయమని వ్యాఖ్యానించాడు. 

‘‘స్వదేశంలో మ్యాచ్‌లను ఆడే దేశాలు వాటికి అనుకూలంగా ఉండే విధంగానే పిచ్‌లను రూపొందించుకొంటాయి. ఇది సర్వసాధారణమైన విషయం. ఇదేమీ అన్యాయం కాదు. ఇంకా ఇలా చేయడం వల్ల టెస్టు క్రికెట్‌కు మంచే జరుగుతుంది’’ అని జాన్‌ రైట్‌ (John Wright) ట్వీట్ చేశాడు. జాన్ రైట్‌ 2000 నుంచి 2005 వరకు టీమ్‌ఇండియాకు కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. భారత్ స్పిన్‌ పిచ్‌నే సిద్ధం చేస్తుందనే ఉద్దేశంతో ఆసీస్‌ బ్యాటర్లు చెమటోడుస్తున్నారు. బెంగళూరులో జరుగుతున్న ట్రైనింగ్‌ సెషన్‌లో ఎక్కువగా స్పిన్నర్ల బౌలింగ్‌లోనే సాధన చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని