IND vs SL: శ్రీలంకతో సిరీస్‌కైనా సంజూను ఎంపిక చేస్తారని ఆశిస్తున్నా: వసీం జాఫర్

వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక, న్యూజిలాండ్‌తో భారత్‌ సిరీస్‌లను ఆడనుంది. ఎప్పటి నుంచో జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని సోషల్‌ మీడియాలో భారీగా మద్దతుగా నిలుస్తున్నారు.

Published : 26 Dec 2022 19:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సిరీస్‌కు జట్టు ఎంపిక అనగానే ఠక్కున గుర్తుకొచ్చే ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ ముందుంటాడు. అప్పటి వరకు రేసులో నిలిచి ఉండే సంజూ.. తుది జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోవడాన్ని ఇప్పటికే చాలాసార్లు అభిమానులు చూసివుంటారు. జనవరి మూడు నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్‌లతోపాటు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లకైనా ఎంపిక చేయాలనే డిమాండ్లూ సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కూడా సంజూను తీసుకుంటే బాగుంటుందని ఆకాంక్షించాడు. 

‘‘సంజూ శాంసన్‌ను శ్రీలంక, న్యూజిలాండ్‌ సిరీస్‌లకు తీసుకొంటారని ఆశిస్తున్నా. టీ20లు, వన్డేల్లో నిలకడగా రాణించే అతడికి చోటు దక్కుతుందని అనుకొంటున్నా’’ అని జాఫర్ ట్వీట్‌ చేశాడు. జాఫర్ చెప్పినట్లు.. సంజూ శాంసన్‌ ఈ ఏడాదిలో అత్యంత నిలకడగా పరుగులు రాబట్టాడు. 2022లో పది వన్డేలు ఆడిన సంజూ 71 సగటుతో 284 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే ఆరు టీ20లను ఆడి 44.75 సగటుతో 179 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 158.40 కావడం విశేషం. 

ఇలా నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌కు జట్టులో స్థానం కోసం రిషభ్‌ పంత్‌తోనే తీవ్ర పోటీ ఉంది. ఇక శ్రీలంకతో సిరీస్‌లకు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ అందుబాటులో ఉండరని బీసీసీఐ వర్గాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో.. కనీసం ఇప్పుడైనా సంజూ శాంసన్‌ను సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో తెలియాలంటే మంగళవారం వేచి చూడాల్సిందే. మంగళవారమే జట్టును ప్రకటించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని