Prithvi Shaw: రంజీ ట్రోఫీలో అదిరిపోయే రికార్డు.. పృథ్వీకి అవకాశం ఇవ్వాలి: మాజీ పేసర్

దాదాపు రెండేళ్ల కిందట భారత్‌ (team india) తరఫున మ్యాచ్‌ ఆడిన యువ బ్యాటర్‌ పృథ్వీషా (Prithvi Shaw).. తాజాగా రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే సూచనలు వచ్చాయి.

Published : 12 Jan 2023 11:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రంజీ ట్రోఫీలో యువ బ్యాటర్ పృథ్వీ షా రికార్డు సృష్టించాడు. అసోం జట్టుపై 379 పరుగులు (383 బంతుల్లో) చేసి.. రంజీ ట్రోఫీ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా అవతరించాడు. ముంబయి తరఫున ఆడుతున్న పృథ్వీని మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. చివరిసారిగా 2021లో భారత్‌ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడిన పృథ్వీ ఆ తర్వాత జట్టులోకి రాలేకపోయాడు. దీంతో అతడి ప్రదర్శనను మేనేజ్‌మెంట్ పరిగణనలోకి తీసుకొని అవకాశాలు కల్పించాలని టీమ్‌ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్‌ ప్రసాద్‌ సూచించాడు.

‘‘పృథ్వీ షా అద్భుతమైన ఆటగాడు. ఇలాంటి టాలెంటెడ్‌ ప్లేయర్‌ను అరుదుగా చూస్తుంటాం. గతంలో జట్టు నుంచి ఏ కారణాలతో తప్పించారనేది అనవసరం. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రదర్శన చేయడం వల్ల టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా పృథ్వీ షాకు అవకాశాలు ఇచ్చే విషయాన్ని ఆలోచించాలి. అతడితో మాట్లాడుతూ.. పర్యవేక్షిస్తూ ఉండాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉంది. ఇలా చేయడం వల్ల పృథ్వీతోపాటు టీమ్‌ఇండియాకు చాలా మేలు జరుగుతుంది’’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశాడు. 

పృథ్వీ ఆవేదన ఇదీ..

టాలెంట్ ఉన్నప్పటికీ ఇతర ఆటగాళ్లతో పోలిస్తే పృథ్వీకి అవకాశాలు చాలా తక్కువగానే వచ్చాయి. ఐపీఎల్‌లో అదరగొట్టేసే పృథ్వీని జాతీయ జట్టు ఎంపికలో మాత్రం పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు. దీంతో ఒకానొక సందర్భంలో పృథ్వీ షా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ‘‘కొన్నిసార్లు చాలా నిరుత్సాహానికి గురవుతుంటా. ఎందుకంటే మనవంతుగా సరైన పద్ధతిలోనే వెళ్తున్నప్పటికీ.. మంచి ఆటతీరు కనబరిచినా.. మైదానంలోనూ, వెలుపల క్రమశిక్షణతో వ్యవహరించినా  అవకాశాలు రాకపోవడంపై అభిమానులు పలురకాలుగా మాట్లాడుతుంటారు. మీ గురించి తెలియనివారు కూడా జడ్జ్‌ చేస్తుంటారు’’ అని పృథ్వీ షా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని