WPL 2023: డబ్ల్యూపీఎల్‌.. అందరూ భారత కెప్టెన్లే ఉంటే బాగుండేది: అంజుమ్‌ చోప్రా

మహిళా ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2023) ఐదు జట్లలో మూడు టీమ్‌లకు విదేశీ కెప్టెన్లు ఉండటం సరైంది కాదని టీమ్‌ఇండియా (Team India) మహిళా జట్టు మాజీ సారథి అంజుమ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేసింది.  

Updated : 04 Mar 2023 18:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళా క్రికెటర్ల నిరీక్షణకు తెరపడింది. తొలి మహిళా ప్రీమియర్‌ లీగ్ (WPL 2023)లో ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు జట్లకు సారథులను ఆయా ఫ్రాంచైజీలు ప్రకటించాయి. ఈ క్రమంలో భారత మహిళా జట్టు కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా మాత్రం ఓ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యుత్తమ భారత క్రికెటర్లకు అన్ని ఫ్రాంచైజీల సారథ్య బాధ్యతలు అప్పగిస్తే బాగుండేదని పేర్కొంది. రెండు జట్లకు మాత్రమే భారత స్టార్‌ ప్లేయర్లు కెప్టెన్‌గా ఉండగా.. మరో మూడు ఫ్రాంచైజీలు విదేశీ క్రికెటర్లను నియమించుకున్నాయి. 

‘‘తొలి మహిళా ప్రీమియర్‌ లీగ్‌లో నాకొక విషయం నచ్చలేదు. ఎక్కువ ఫ్రాంచైజీలు విదేశీ క్రికెటర్లనే తమ జట్లకు కెప్టెన్‌గా నియమించుకున్నాయి. ఇది భారత క్రికెట్‌ లీగ్‌ (WPL 2023). స్వదేశంలోని పరిస్థితులు ఇక్కడి వారికి బాగా అర్థం అవుతాయి. కాబట్టి, కెప్టెన్సీ చేయగల సామర్థ్యం కలిగిన టీమ్‌ఇండియా ప్లేయర్లకే జట్టు పగ్గాలను అప్పగిస్తే బాగుండేది. దీప్తి శర్మ కూడా సారథిగా జట్టును నడిపించగలదు. ఇప్పటికే ఉమెన్స్ టీ20 ఛాలెంజ్‌ టోర్నీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. అయితే, భారత ప్లేయర్లతో పోలిస్తే ఆసీస్‌ క్రికెటర్లకు అనుభవం ఎక్కువే. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ, స్వదేశంలో భారత అమ్మాయిలకే జట్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుంది. అనుభవపరంగా అయితే ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఉన్న మెగ్‌ లానింగ్‌ను కాదని జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ ఇవ్వలేరు. సహజంగా చూసుకుంటే.. ఆసీస్‌ ప్లేయర్లతో పోలిస్తే భారత క్రికెటర్లకు కెప్టెన్సీ సామర్థ్యం తక్కువే’’ అంజుమ్‌ చోప్రా తెలిపింది.

‘‘క్రికెట్‌ ప్రొఫెషనల్‌ గేమ్. కొంత ధరకు ఆయా ఫ్రాంచైజీతో కాంట్రాక్ట్‌ అయి ఉంటారు. ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. అయితే, పరిస్థితులను త్వరగా అలవర్చుకొని ఇతర ప్లేయర్ల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. దేశీయ క్రికెటర్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తారని నేను భావిస్తున్నా. అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం రావడం నిజంగా అద్భుతం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు భారత క్రికెట్‌కు ఎన్నో సవాళ్లు విసిరాయి. ఇప్పుడు ఈ టోర్నీ తప్పకుండా టీమ్‌ఇండియా (Team India) క్రికెట్‌కు సాయపడుతుంది’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని