Virat : విండీస్‌తో సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేస్తే బాగుండేది.. విశ్రాంతి సరైంది కాదు: ఓజా

ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి పలువురు మాజీలు మద్దతు తెలుపుతూనే కీలక సూచనలు చేస్తున్నారు. భారత క్రికెట్‌ కోసం ఎంతో చేసిన కోహ్లీకి..

Published : 28 Jul 2022 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి పలువురు మాజీలు మద్దతు తెలుపుతూనే కీలక సూచనలు చేస్తున్నారు. భారత క్రికెట్‌ కోసం ఎంతో చేసిన కోహ్లీకి ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మతోపాటు కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ బాసటగా నిలుస్తున్నారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో విఫలమైన కోహ్లీకి విండీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. అయితే కోహ్లీని విండీస్‌ సిరీస్‌లో ఆడిపిస్తే బాగుండేదని భారత మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అభిప్రాయపడ్డాడు. గత మూడేళ్లుగా అడపాదడపా కొన్ని మంచి ఇన్నింగ్స్‌లను ఆడుతున్నప్పటికీ శతకం చేయలేకపోవడంతో విరాట్‌పై విమర్శలు పెరిగాయి. వచ్చే ప్రపంచకప్‌ జట్టులో స్థానం కల్పించవద్దనే డిమాండ్లూ తలెత్తాయి. అందుకోసమే విండీస్‌ పర్యటనకు విరాట్‌ను దూరం పెట్టారనే చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజ్ఞాన్‌ ఓజా మాత్రం కోహ్లీని విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఆడనివ్వాలని సూచించాడు. 

‘‘విరాట్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దాదాపు పదేళ్లపాటు అన్ని ఫార్మాట్లలో 70 శతకాలు సాధించాడు. ఇలా రాణించిన ఆటగాళ్లు చాలా తక్కువ. అందుకే రోహిత్, రాహుల్‌, జట్టు యాజమాన్యం మద్దతుగా నిలిచింది. ఒక్కసారి కోహ్లీ ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరి తరమూ కాదని వారిద్దరికి తెలుసు. అలాంటి కోహ్లీ ఉన్న  జట్టుతో టీ20 ప్రపంచకప్‌, వన్డే వరల్డ్‌కప్‌ బరిలోకి దిగితే ఎలాంటి టీమ్‌ అయినా  వెనుకడుగు వేయాల్సిందే. అయితే కోహ్లీ ఫామ్‌ అందుకోవడమే కీలకం. ఇక్కడ  చూడాల్సింది కోహ్లీ నైపుణ్యం గురించి కాదు. ఎందుకంటే ఎలాంటి టాలెంట్ లేకుండానే శతకాలు చేయడం సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు కోహ్లీ మానసిక పరిస్థితి ఎలా ఉందనేది చూడాలి. విరామం కాకుండా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిస్తేనే బెటర్‌. అందుకే విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నా’’ అని ప్రజ్ఞాన్‌ ఓజా సూచించాడు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని