WTC Final: ఇషాన్‌, భరత్‌.. తుది జట్టులో ఎవరు? అతడికే మాజీ వికెట్‌ కీపర్‌ మద్దతు!

భారత్‌కు వికెట్‌ కీపర్ ఎంపిక సందిగ్ధంలో పడింది. రిషభ్‌ పంత్ ఉండుటే.. మరే ఆటగాడికి అవకాశం వచ్చేది కాదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final 2023) పంత్ లేకపోవడం టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందిగా మారింది. 

Published : 04 Jun 2023 14:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. అయితే, భారత్‌ ముందు ఉన్న ఏకైక సమస్య.. తుది జట్టు ఎంపిక గురించే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరీ ముఖ్యంగా వికెట్ కీపర్‌ ఎవరనేది తేలాల్సి ఉంది. రిషభ్‌ పంత్ ప్రమాదంబారిన పడటంతో  మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందిగా మారింది. కేఎల్ రాహుల్‌ కూడా గాయం కారణంగా వైదొలిగాడు. ఒకవేళ అతడు జట్టుతో ఉండుంటే రాహుల్‌నే వికెట్‌ కీపర్‌గా వినియోగించుకొనే అవకాశం ఉండేది. అప్పుడు మరొక అదనపు బౌలర్‌ను తీసుకొనే వీలుండేది. ఇప్పుడు మాత్రం వికెట్‌ కీపర్‌ పోస్టు కోసం ఇద్దరు తీవ్రంగా పోటీ పడుతున్నారు. లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌తోపాటు ఈ ఏడాది టెస్టుల్లోకి అడుగు పెట్టిన కేఎస్ భరత్ బరిలో నిలిచాడు. ఇషాన్‌ ఇంతవరకు టెస్టు అరంగేట్రం చేయలేదు. కానీ, లెఫ్ట్‌హ్యాండ్ కావడంతో అతడికి అవకాశం వస్తుందేమో చూడాలి.

టీమ్‌ఇండియా మాజీ వికెట్ కీపర్‌ నయాన్‌ మోంగియా మాత్రం భరత్‌ వైపే మొగ్గు చూపాడు. భారత్‌ స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ‘‘ఇంగ్లాండ్‌లో ఆసీస్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్‌ఇండియా స్పెషలిస్ట్‌ కీపర్‌తోనే బరిలోకి దిగాలి. అందుకే, భరత్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. ఏదొక మ్యాచ్‌లో సరిగా ఆడలేదని.. అతడిని బ్యాడ్‌ కీపర్‌ అవ్వడు.  అతడు స్పెషలిస్ట్ వికెట్‌ కీపర్. ఇప్పటి వరకు చాలా తక్కువ అవకాశాలు మాత్రమే వచ్చాయి. తప్పనిసరిగా అతడికి ఛాన్స్‌ ఇవ్వాలి. 

ఇంగ్లాండ్ పిచ్‌ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. అక్కడ వికెట్‌ కీపింగ్‌ చేయడం చాలా క్లిష్టం. బంతి బౌన్స్‌, జారిపోవడం జరుగుతుంటుంది. రోజంతా బంతిపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. డ్యూక్స్‌ బంతులతో ఆడేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. కుకుబుర్రాతో పోలిస్తే ఇలాంటి బాల్స్‌తో ఆడటం ఇంకాస్త కష్టం. సీమ్‌తోపాటు స్వింగ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గతంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాం. అందుకే, అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది’’ అని మోంగియా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని