T20 World Cup 2024: ఇక పాక్‌కు ఛాన్స్‌ లేనట్లే.. ‘ఆల్‌ ది బెస్ట్‌ ఫర్ నెక్స్ట్‌ ఎడిషన్‌’: భారత మాజీ స్టార్ పేసర్

సూపర్-8కు చేరుకొనే అవకాశాలు ఇతర జట్ల ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌కు ఎదురైంది. నేడు యూఎస్ఏ-ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దైతే మాత్రం పాక్‌ ఇంటిదారి పట్టక తప్పదు.

Updated : 14 Jun 2024 12:02 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన పాక్‌ ‘సూపర్- 8’ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కెనడాపై విజయం సాధించిన పాక్‌ రేసులో నిలిచినప్పటికీ.. యూఎస్‌ఏ-ఐర్లాండ్‌ మ్యాచ్ ఫలితంతోపాటు తాను చివరి పోరులో గెలిస్తేనే కాస్తయినా అవకాశం మిగిలి ఉంటుంది. అయితే, ఫ్లోరిడా వేదికగానే నేడు యూఎస్ఏ-ఐర్లాండ్‌ తలపడనున్నాయి. కానీ, అక్కడి వాతావరణం మ్యాచ్‌ నిర్వహణకు అనుకూలంగా లేదు. భారీ వర్షాలు పడుతూ జనజీవనం స్తంభించింది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. దీంతో మ్యాచ్ రద్దు అయితే యూఎస్‌ఏ ‘సూపర్-8’కి దూసుకెళ్తుంది. పాక్‌ ఇంటిముఖం పడుతుంది. ఆ జట్టు తదుపరి దశకు చేరుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందేనంటూ భారత మాజీ పేసర్ శ్రీశాంత్‌ వ్యాఖ్యానించాడు. పాక్‌ క్రికెట్‌ వ్యవస్థలో చాలా మార్పులు రావాలన్నాడు. 

‘‘పాకిస్థాన్‌ సూపర్‌-8కి చేరుకోవడం ఆ జట్టు అదృష్టంపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకెళ్లడం దాదాపు అసాధ్యమే. పాక్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం వారి దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థ బలహీనంగా ఉండటమే. ఇదే మాట ఆ జట్టు మాజీలు వసీమ్‌ అక్రమ్, వకార్‌ యూనిస్‌ కూడా చెప్పారు. మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన అవసరం ఉంది. కనీసం వచ్చే ఎడిషన్‌లోనైనా నాణ్యమైన ఆటతీరుతో ఆకట్టుకుంటారని ఆశిద్దాం. ఈసారి ఆ జట్టు తదుపరి దశకు వచ్చిందంటే అదొక విచిత్రమే అవుతుంది. 

ఈ ప్రపంచ కప్‌లో అన్ని జట్ల కంటే యూఎస్‌ఏ చాలా ఆకట్టుకుంది. కుర్రాళ్లు గెలవాలనే పట్టుదల ప్రదర్శించారు. కెనడా, పాక్‌ను చిత్తు చేసిన వైనమే దీనికి ఉదాహరణ. భారత్‌కు మంచి పోటీ ఇచ్చారు. ప్రతి జట్టూ పేపర్‌పై బలంగా కనిపించింది. కానీ, మైదానంలోకి దిగిన తర్వాత వారి ప్రణాళికలను సరిగ్గా అమలు చేసిన జట్టే విజేతగా నిలిచింది. ఈ విషయంలో యూఎస్‌ఏ సక్సెస్ అయినట్లే. గత రెండేళ్లుగా వారు చేసిన కృషికి ఫలితం ఇది. టాప్-8లో యూఎస్‌ఏ ఉంటుందని ఆశిస్తున్నా, ఆ జట్టుకు అర్హత ఉంది. అక్కడా ఏమైనా అద్భుతాలు చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని శ్రీశాంత్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు