Cricket News: రెండింట్లో విఫలమైనా తిలక్‌ రెడీనే.. మహిళలకూ సమాన పారితోషికం.. బాబర్‌ చెత్త రికార్డు

తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ (Tilak Varma) జాతీయ జట్టులోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే మినీ టోర్నీ ఆడేందుకు ఎంపిక కావడం విశేషం. తమ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజుల విషయంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ అనవసర రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

Published : 23 Aug 2023 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం ప్రకటించిన జట్టులో యువ ఆటగాడు తిలక్‌ వర్మకు (tilak Varma) చోటు దక్కింది. అతడిని ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. మిడిలార్డర్‌లో కీలకంగా మారతాడని, బౌలింగ్‌ చేయగలడం అదనపు బలమని పేర్కొంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

ముద్దు వివాదం.. ఆ క్షమాపణలు సరిపోవంటూ ఫుట్‌బాల్‌ బాస్‌పై స్పెయిన్‌ పీఎం ఆగ్రహం

‘‘తిలక్‌ వర్మ (Tilak Varma) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడి దేశవాళీ క్రికెట్ గణాంకాలతోపాటు విండీస్‌ సిరీస్‌లో ప్రదర్శన సూపర్. అయితే, గత రెండు టీ20 మ్యాచుల్లో విఫలమైనప్పటికీ.. వన్డే క్రికెట్‌ కోసం సిద్ధంగా ఉన్నాడనే భావిస్తున్నా. అందుకే టీమ్‌ఇండియా నుంచి పిలుపొచ్చింది. అతడి బ్యాటింగ్‌ వీక్‌నెస్‌ను కనుక్కోవడం కష్టమే. నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో నాణ్యమైన క్రికెటర్లు ఉండాలని ఇంతకముందే చెప్పా. టాప్‌-3లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. టీమ్‌ఇండియా సెలెక్షన్ కమిటీ స్పష్టతతో ఉండటం అభినందనీయం. అజిత్‌ అగార్కర్‌, రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఇచ్చిన సమాధానాలు ఆకట్టుకున్నాయి. కేఎల్ రాహుల్ విషయంలోనూ ఇచ్చిన సమాధానం ముఖ్యం. రాహుల్‌ కోలుకుని వచ్చాక కూడా అదనంగా మరొక వికెట్ కీపర్‌ను బ్యాకప్‌గా ఉంచారు. ఎందుకు అవసరమనేదానిపై ఇచ్చిన వివరణ బాగుంది. ఇదే స్క్వాడ్‌ ప్రపంచ కప్‌లోనూ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువ. ఇందులో నుంచి ఓ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే బయటకు వెళ్తారు. మరీ ముఖ్యంగా ఒక స్పిన్నర్‌ను తీసేసే అవకాశం ఉంది. మరొక వికెట్ కీపర్‌  లేదా ఫాస్ట్‌ బౌలర్‌ కూడా ఉండక పోవచ్చు’’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.


దక్షిణాఫ్రికాలోనూ పురుషులతో సమంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు

పురుష క్రికెటర్లతో సమంగా మ్యాచ్‌ ఫీజులను చెల్లించే మూడో క్రికెట్ బోర్డుగా దక్షిణాఫ్రికా అవతరించింది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌ ఎలాంటి వివక్షకు తావులేకుండా సమానంగా మ్యాచ్‌ ఫీజులను చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఇదే బాటలోకి వచ్చింది. గత ఏడాదిన్నర నుంచి దక్షిణాఫ్రికా మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పొట్టి వరల్డ్‌ కప్‌లోనూ ఫైనల్‌కు చేరి ఆశ్చర్యపరిచింది. అయితే, ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో పోరాడి ఓడింది. దీంతో మహిళా క్రికెటర్లను మరింత ప్రోత్సహించే క్రమంలో వారికీ మ్యాచ్‌ ఫీజుల విషయంలో ఉన్న వ్యత్యాలను తొలగించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. 


ఇమ్రాన్‌ ఖాన్‌ సరసన బాబర్

పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో మాజీ సారథి ఇమ్రాన్‌ ఖాన్ సరసన చేరాడు. ఆసియా కప్‌ టోర్నీకి ముందు అఫ్గానిస్థాన్‌తో పాకిస్థాన్‌ వన్డే సిరీస్‌ ఆడుతోంది. అదీనూ శ్రీలంక వేదికగా కావడం గమనార్హం. తొలి వన్డే మ్యాచ్‌లో అఫ్గాన్‌పై పాక్‌ 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బాబర్ అజామ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. కేవలం మూడు బంతులే ఆడిన బాబర్ అఫ్గాన్‌ బౌలర్ ముజీబ్‌కి దొరికిపోయాడు. దీంతో అత్యధిక డకౌట్లు అయిన నాలుగో పాక్‌ బ్యాటర్‌గా అవతరించాడు. వసీమ్‌ అక్రమ్‌ (8) అందరికంటే ఎక్కువగా డకౌట్లు అయిన బ్యాటర్. ఇమ్రాన్‌ ఖాన్‌తో సమంగా బాబర్ అజామ్ 4 సార్లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. ఇంజమామ్‌ ఉల్ హల్, మోయిన్ ఖాన్‌ మూడేసి సార్లు డకౌట్‌ కావడం గమనార్హం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు