IND vs ENG: 18నెలల కిందట చూసిన బౌలర్‌లా లేడు.. టీమ్ ఇండియాకు పెద్ద షాక్: మాజీ క్రికెటర్లు

 భారత్‌ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఛేదించి ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనపై...

Updated : 06 Jul 2022 12:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఛేదించి ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జో రూట్ - బెయిర్‌స్టో భాగస్వామ్యాన్ని విడదీయడంలో బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. టీమ్‌ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్,  మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్, మాజీ వికెట్ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

అప్పుడు చూసిన బౌలర్‌లా లేడు.. : మంజ్రేకర్

టీమ్‌ఇండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరీ ముఖ్యంగా శార్దూల్‌ ఠాకూర్‌ 113 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. 18 నెలల కిందట చూసిన శార్దూల్‌ ఠాకూర్‌.. ఇప్పటి శార్దూల్‌కు చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు టెస్టు క్రికెట్‌లో కీలక సమయంలో వికెట్లు తీస్తూ ఉండేవాడు. కానీ ఈ టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. అదేవిధంగా సిరాజ్‌ బౌలింగ్‌ను గమనిస్తే.. లెంగ్త్‌ లేదనిపిస్తోంది. 

టీమ్‌ఇండియాకు పెద్ద షాక్‌: అజిత్ అగార్కర్‌

ఇంగ్లాండ్‌ 378 పరుగులను ఛేదించడం.. భారత్‌కు పెద్ద షాక్‌. కేవలం 76.4 ఓవర్లలోనే మూడు వికెట్లను మాత్రమే నష్టపోయి చేయడమంటే భారత బౌలర్ల ఘోర వైఫల్యానికి నిదర్శనం. కేవలం ఇద్దరే బ్యాటర్లు ఎంతో నమ్మకంగా బ్యాటింగ్‌ చేశారు. ఓపెనర్లతోపాటు వెంటనే ఇంకో వికెట్‌ పడినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. భారత జట్టులో లోపించిన అంశం కూడా కాన్ఫిడెన్స్‌. ఇంగ్లాండ్‌ చాలా కృషి చేసింది. అందుకే సులువుగా ఛేదించేసింది. 

స్థిరమైన సారథ్యం ఉండాలి: దీప్‌దాస్‌ గుప్తా

ఈ ఓటమి భారత్‌కు స్థిరమైన కెప్టెన్‌ అవసరాన్ని నొక్కి చెప్పింది. గాయాలపాలు కావడం లేదా ఇతర కారణాలతో సారథులను మార్చాల్సి వస్తోంది. అది కూడానూ భారత్‌ ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. రోహిత్‌ శర్మ ఫిట్‌గా ఉన్నాడు కాబట్టి ఇక ఆ సమస్య ఉండబోదు. రాబోయే మ్యాచ్‌లకు పూర్తిగా అందుబాటులో ఉంటాడు. ఇక వచ్చే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. ప్రపంచకప్‌లోపు కనీసం 20-22 మ్యాచ్‌లను టీమ్‌ఇండియా ఆడొచ్చు. కాబట్టి ప్రతి మ్యాచ్‌ ముఖ్యమైందే. సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు ఇది చాలా కీలకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని