Pakisthan Cricket Board: పీసీబీకి మరో మార్గం లేదు..అంగీకరించాల్సిందే: డానిష్‌ కనేరియా

ఈ అంశంపై  పాక్‌ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా స్పందించాడు. పాక్‌ అన్నంత పని చేయలేదని, భారత్‌ నిర్ణయాన్ని ఆమోదించడం తప్ప పీసీబీకి మరో దారి లేదని తెలిపాడు. 

Published : 21 Oct 2022 02:08 IST

దిల్లీ: వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికపై ఆసియా కప్‌ నిర్వహిస్తామని ఏసీసీ(ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జయ్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్‌కు కౌంటర్‌గా వన్డే ప్రపంచకప్‌ 2023 సహా ఏసీసీ కౌన్సిల్‌ నుంచి వైదొలుగుతామని ఇటీవల పేర్కొంది. తాజాగా ఈ అంశంపై  పాక్‌ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా స్పందించాడు. పాక్‌ అన్నంత పని చేయలేదని, భారత్‌ నిర్ణయాన్ని ఆమోదించడం తప్ప పీసీబీకి మరో దారి లేదని తెలిపాడు. 

‘‘బీసీసీఐ నిర్ణయం సరైందే కావచ్చు. ఐసీసీకి 90 శాతం నిధులు వారి నుంచే అందుతుండవచ్చు. అందులో పాక్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు. పీసీబీ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేకపోయినా మిగిలిన దేశాలైనా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి దేశాల మద్దతు భారత్‌కే ఉంటుంది. ఎందుకంటే.. బీసీసీఐ ఎంత శక్తిమంతమైందో వారికి తెలుసు. బీసీసీఐ నిర్ణయం ఏదైనా అంగీకరించాల్సిందే. అందులో తప్పేమీ లేదు. ఇరు దేశాల మధ్య రాజకీయపరమైన పరిస్థితులు అలా ఉన్నాయి. పాక్‌లో పర్యటించడానికి అక్కడి బోర్డుకు అనుమతులు లభించకపోవచ్చు. ఈ సమస్యను ఇరు దేశాల బోర్డులు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాలి. వచ్చే ఏడాది వన్డే ప్రంచకప్‌ సిరీస్‌ నుంచి తమ దేశం వైదొలగాలని కొందరు సూచించారు. కానీ పాక్‌ అలా చేయలేదు. బీసీసీఐ నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప దానికి వేరే మార్గం లేదు. కానీ భారత్‌ తలుచుకుంటే పాక్‌తో ఐసీసీ ఈవెంట్లను సైతం రద్దు చేసుకోగలదు. రేపు అఫ్గానిస్థాన్‌ కూడా మా దేశంలో ఆడటానికి అంగీకరించకపోవచ్చేమో’’ అని కనేరియా వ్యాఖ్యానించాడు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని