Shubman Gill: క్రికెట్‌కు గిల్‌లాంటి ఆటగాడు చాలా అవసరం: పాక్‌ మాజీ కెప్టెన్‌

డబుల్‌ సెంచరీ బాదిన శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)పై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా పాక్‌ మాజీ కెప్టెన్ కూడా అభినందనలు కురిపించాడు. 

Published : 20 Jan 2023 12:38 IST

ఇంటర్నెట్ డెస్క్: అత్యంత పిన్న వయసులోనే డబుల్‌ సెంచరీ బాదిన బ్యాటర్‌గా టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుబ్‌మన్‌ గిల్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్‌ గిల్ ద్విశతకం సాధించాడు. ఇలాంటి ఆటగాడే క్రికెట్‌కు అవసరమని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్ భట్‌ తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రశంసించాడు. ఇలాగే నిలకడగా ఆడితే మాత్రం గిల్ క్రికెట్‌ దిగ్గజం కావడం ఖాయమని పేర్కొన్నాడు.

‘‘గతేడాది టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో గిల్‌ ఆట చూశాక.. నేను అతడికి అభిమాని అయిపోయా. అతడి బ్యాటింగ్‌ విధానం, స్టైల్‌ నిజంగా అభినందనీయం. అసలు గిల్‌ భారీ స్కోర్లుగా ఎందుకు మలచలేకపోతున్నాడనే ఆందోళన కాస్త నాకుండేది. ఇప్పుడు అతడు ఆడిన విధానం చాలా బాగుంది. చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే చాలా చిన్న వయసులో ఇలా ముగించడం ఆశ్చర్యమేసింది. కెరీర్‌లో అన్నీ సాధించేశాడని చెప్పను కానీ.. ఇలాగే నిలకడగా కష్టపడుతూ ఉంటే మాత్రం ఉన్నత శిఖరాలకు తప్పకుండా చేరతాడు. కివీస్‌తో తొలి వన్డేలో చివర్లో అతడు చాలా దూకుడుగా ఆడాడు. ప్రారంభంలో నిదానంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. కేవలం దూకుడుగానే కాకుండా బాధ్యతతో బ్యాటింగ్‌ చేయగలనని నిరూపించుకొన్నాడు. గతంలో సచిన్‌, మార్క్‌ వా, సయీద్‌ అన్వర్, జాక్వెస్‌ కలిస్‌ కూడా ఇలాగే ఆడేవారు. వారంతా క్రికెట్‌ను వీడిన చాన్నాళ్లకు .. మళ్లీ అలాంటి బ్యాటింగ్‌ సొగసును ఇప్పుడు గిల్‌ రూపంలో చూడటం ఆనందంగా ఉంది’’ అని భట్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని