MS Dhoni-Virat: కోహ్లీతోపాటు నాకూ టికెట్‌ బుక్‌ చేయండి: ధోనీ సమాధానంపై పాక్‌ మాజీ షాక్

ఫామ్‌ కోల్పోయినప్పుడు ఆటగాడికి కెప్టెన్‌ నుంచి మద్దతు లభిస్తే.. తిరిగి పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో ధోనీ, రోహిత్ సక్సెస్‌ కావడం గమనార్హం.

Updated : 03 Jul 2024 15:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సహచరులకు మద్దతుగా నిలవడంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ముందుంటాడు. ఈ మాట అంటోంది టీమ్‌ఇండియాకు చెందిన ప్లేయర్లు కాదు. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్‌ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సంఘటన అది. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలోనే ఇది జరగడం గమనార్హం. ఇప్పుడంటే దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. కానీ, 2012-13 సీజన్‌లో భారత్‌ పర్యటనకు పాకిస్థాన్‌ (IND vs PAK) వచ్చింది. అప్పుడు తనకు ఎదురైన అనుభవాలను ఉమర్‌ అక్మల్‌ ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు. అప్పుడు పెద్దగా ఫామ్‌లో లేని విరాట్‌ను సిరీస్‌ నుంచి తప్పించాలని మేనేజర్‌ చేసిన సూచనకు ధోనీ షాకింగ్‌ రిప్లయ్‌ ఇచ్చినట్లు అక్మల్ తెలిపాడు. 

‘‘మేం 2012-13 సీజన్‌లో భారత పర్యటనకు వెళ్లాం. ఓ రోజు ధోనీ, సురేశ్‌ రైనా, యువరాజ్‌, షోయబ్‌ మాలిక్‌తో కలిసి డిన్నర్‌ చేస్తున్నాం. అదే సమయంలో ధోనీ వద్దకు టీమ్‌ఇండియా (Team India) మేనేజర్ వచ్చారు. విరాట్ కోహ్లీ పెద్దగా ఫామ్‌లో లేడు. అతడిని వన్డే సిరీస్‌ నుంచి పక్కనపెడదామని ధోనీకి ఆ మేనేజర్‌ సూచించాడు. వెంటనే ధోనీ స్పందిస్తూ.. ‘నేను ఇంటికి వెళ్లి ఆరు నెలలు అయింది. విరాట్‌తో కలిసి నాకూ టికెట్‌ను ఎందుకు బుక్‌ చేయకూడదు?’ అని ప్రశ్నించాడు. ఆ సమాధానంతో మేనేజర్‌ మారుమాట్లాడలేదు. చివరికి కెప్టెన్ అనుకున్నట్లుగానే విరాట్‌ను ఆడించేందుకు అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి నేను కూడా ఇదే డౌట్‌ను ధోనీ ముందు ఉంచా. దానికి రిప్లయ్‌ ఇస్తూ ‘విరాట్ (Virat Kohli) మా అత్యుత్తమ బ్యాటర్. కేవలం మూడు లేదా నాలుగు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన మేం ఎలా అతడిని పక్కన పెడతాం?’ అని చెప్పాడు. ధోనీ ఇచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక ఆటగాడికి ఇలాంటి మద్దతు లభిస్తే అంతకుమించిన బహుమానం మరొకటి ఉండదని అనుకున్నా’’ అని అక్మల్ వ్యాఖ్యానించాడు. దీంతో ధోనీని విమర్శించే కోహ్లీ అభిమానులు ఇకనైనా నిజం తెలుసుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్‌ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. 

టీ20 ప్రపంచకప్‌ 2024 ఎడిషన్‌లోనూ విరాట్ కోహ్లీ ఫైనల్‌ మినహా మిగతా మ్యాచుల్లో రాణించని విషయం తెలిసిందే. ఇదే మాటను ఫైనల్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను అడిగితే.. ఫైనల్‌ కోసం కోహ్లీ తన శక్తినంతా దాచి పెట్టాడేమోనని వ్యాఖ్యానించాడు. సరిగ్గా తుది పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో (76 పరుగులు) భారత్‌ విజయంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ధోనీ తర్వాత టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) నెగ్గిన రెండో సారథిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడిన విరాట్‌కు అప్పుడు ధోనీ.. ఇప్పుడు రోహిత్ మద్దతుగా నిలిచారని ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని