Virat Kohli: విరాట్ కోహ్లీ నా అంచనాలను మార్చేశాడు: పాక్‌ మాజీ పేసర్

అనితర సాధ్యమైన రికార్డులను సాధించగలిగే సత్తా విరాట్ కోహ్లీ (Virat Kohli) సొంతం. అయితే దాదాపు మూడేళ్లపాటు సెంచరీ లేకుండా విమర్శలపాలైన సంగతి తెలిసిందే. 

Published : 02 Mar 2023 20:16 IST

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడేళ్లపాటు సెంచరీ లేకుండా.. విమర్శలపాలైన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్‌ అందుకొని వరుస పెట్టి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దాదాపు నెల రోజులపాటు ఆటకు దూరమై తిరిగొచ్చిన కోహ్లీ.. వరుసగా నాలుగు శతకాలను బాదడం గమనార్హం. ఇందులో ఒకటి టీ20ల్లో కాగా.. మరో మూడు మాత్రం వన్డేల్లో సాధించాడు. విరాట్ (Virat) ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడిన సందర్భంలో పాక్‌ మాజీ పేసర్ మహమ్మద్ అసిఫ్ (Mohammad Asif) పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తన మ్యాజిక్‌ టచ్‌ను కోల్పోయిన కోహ్లీ తిరిగి పుంజుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. అయితే, ఆసీస్‌తో టెస్టు సిరీస్ మినహా అద్భుతంగా ఆడిన విరాట్‌ను అభినందిస్తూనే.. తన వ్యాఖ్యలపై అసిఫ్‌ యూ టర్న్ తీసుకున్నాడు. 

‘‘గతంలో నేను విరాట్ తన ఫామ్‌ను అందుకోవడం కష్టమని చెప్పా. కానీ, ఇప్పుడు అసాధ్యం కాదని మాత్రం చెప్పగలను. ఓ ఆటగాడు 32 ఏళ్ల వయస్సులో ఇంత బలంగా పుంజుకొని తిరిగి రావడం చాలా కష్టం. కానీ, విరాట్ మాదిరిగా పైచేయి సాధించే ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. వారి కెరీర్‌లో అధ్వానమైన రోజులు ఉన్నప్పటికీ.. వాటిని అధిగమించగలరు. సచిన్‌, బాబర్ అజామ్‌ వంటి ఆటగాళ్లు సులువుగా బయటపడతారు. విరాట్ కోహ్లీ నాకెంతో ఇష్టమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్‌ ఎంజాయ్‌ చేస్తా’’ అని అసిఫ్‌ తెలిపాడు. 2011లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అసిఫ్‌పై ఆరోపణలు రావడంతో ఏడేళ్లపాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. సంవత్సరంపాటు జైలు శిక్ష పడినప్పటికీ.. సగం రోజులు మాత్రమే శిక్ష అనుభవించాడు. అయితే, 2015లో ఐసీసీ అతడి సస్పెన్షన్‌ను రద్దు చేసి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు అనుమతి ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని