Asia Cup 2023: ఆసియా కప్‌ వేదికపై తొలగని సందిగ్ధత.. పాక్‌ మాజీ ప్లేయర్‌ కీలక వ్యాఖ్యలు

దాయాదుల మధ్య పోరు(IND vs PAK) కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుందని తెలుసు కదా.. కానీ, ఇరు జట్లూ ఒకరి దేశంలో మరొకటి ఆడవు. అయితే, ఈ ఏడాది రెండు మెగా ఈవెంట్లు జరగనుండటంతో.. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Published : 25 Feb 2023 12:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ 2023 వేదికపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌ అతిథ్య దేశం కాగా.. బీసీసీఐ (BCCI) మాత్రం అక్కడికి టీమ్ఇండియాను (Team India) పంపేదిలేదని తెగేసి చెప్పేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)లో ఇప్పటికే చర్చలు జరగగా.. మార్చిలో మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, భారత్‌ ఆడే మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు పాక్‌ సిద్ధమనే వార్తలు వచ్చాయి. పాకిస్థానే టోర్నీని నిర్వహిస్తూ.. టీమ్‌ఇండియా మ్యాచ్‌లను మాత్రం యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడానికి పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) సంసిద్ధత వ్యక్తం చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఇదే అంశంపై పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లకు భారతీయ అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోందన్నాడు. అలాగే, టీమ్‌ఇండియా ఆసియా కప్‌ కోసం తమ దగ్గరకు రాకపోతే.. వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) కోసం భారత్‌కు వెళ్లకూడదని చెప్పాడు. 

‘‘పాక్‌లో జరిగే ఆసియా కప్‌ను ఆడేందుకు భారత్‌ అంగీకరించకపోతే.. 2023 వన్డే ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్ జట్టు అక్కడికి వెళ్లకూడదు. అయితే, ఇవేమీ మన చేతుల్లో ఉండవు. ఐసీసీ నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే పీసీబీ అయినా దానిపై దృష్టిపెట్టాలి. మేం ప్రపంచ ఛాంపియన్లం. టీ20 ప్రపంచకప్‌తోపాటు ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలోనూ అగ్ర స్థానంలో నిలిచాం. అయితే, ఐసీసీ, పీసీబీ, బీసీసీఐ చేతుల్లో ఏమీ లేదు. రెండు ప్రభుత్వాల స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఇరు జట్లూ పర్యటించవు. మరి ఇదెంత కాలం ఉంటుందో చూడాలి’’ అని కమ్రాన్‌ అక్మల్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని