IND vs AUS: శుభ్‌మన్‌ ఇంకా మెరుగవ్వాలి.. లేకపోతే డేంజర్‌లో పడినట్లే: డానిష్

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy) మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్‌ (IND vs AUS) విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత బ్యాటింగ్ విభాగం విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

Published : 05 Mar 2023 15:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో (IND vs AUS) దారుణంగా విఫలమై నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్‌ (KL Rahul) స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్‌ తన స్థాయి ప్రదర్శనను చేయలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో పాక్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్‌కు సువర్ణావకాశం వచ్చిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉందని చెప్పాడు. కానీ, మూడో టెస్టులో గిల్‌ ప్రదర్శన దారుణంగా ఉందని.. అతడి స్థానంలో సూర్యకుమార్‌ను తీసుకోవడం ఉత్తమమని వ్యాఖ్యానించాడు.

‘‘రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ గిల్ ఔటైన తీరు దారుణం. అందుకే, తదుపరి మ్యాచ్‌లో అతడి స్థానానికే ప్రమాదం పొంచి ఉంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గిల్ ఆడిన విధానంపై కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా అసంతృప్తికి గురయ్యాడు. ఎప్పుడైతే కోచ్‌ బ్యాటర్ ప్రదర్శనపై సంతృప్తి చెందడో.. అప్పుడు తుది జట్టులో ఆడేందుకు అవకాశాలు బలహీనంగా మారతాయి. అందుకే ఇలాంటి షాట్లు అస్సలు ఆడకూడదు. కేఎల్ రాహుల్‌ కూడా ఇదే ఆటతీరుతో జట్టులో స్థానం కోల్పోయాడు. గిల్‌ తప్పకుండా తన బ్యాటింగ్‌ తీరును మెరుగుపర్చుకోవాలి. భారత్ విజయం సాధించాలంటే తప్పకుండా టాప్‌ ఆర్డర్‌ రాణించాలి. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్ బదులు సూర్యకుమార్‌ ఉత్తమేమో ఆలోచించాలి. ఎందుకంటే అతడు 360 డిగ్రీల ఆటగాడు. ఇలాంటి పిచ్‌ల మీద ఆడగలిగే సత్తా సూర్యకుమార్‌ సొంతం’’ అని డానిష్ కనేరియా తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు