IPL-Buttler-Hafeez: ఐపీఎల్‌పై బట్లర్‌ వ్యాఖ్యలు.. తప్పుబట్టిన పాక్‌ మాజీకి మైకెల్ వాన్ గట్టి కౌంటర్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్‌ ఐపీఎల్‌. ఇలాంటి లీగ్‌పై ఎప్పుడు అవకాశం వచ్చినా కామెంట్ చేయడానికి సిద్ధంగా ఉండే పాక్‌ మాజీ క్రికెటర్‌ ఒకరికి మైకెల్ వాన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

Published : 25 Jun 2024 00:04 IST

ఇంటర్నెట్ డెస్క్:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (Indian Premier League)) జరుగుతున్నప్పుడు ఐసీసీ క్యాలెండర్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుండా చూడాలని ఇంగ్లాండ్‌ కెప్టెన్ జోస్ బట్లర్ చేసిన వ్యాఖ్యలను పాక్‌ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్‌ తప్పుబట్టాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసీస్‌ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌, ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకెల్ వాన్‌తో కలిసి హఫీజ్‌ పాల్గొన్నాడు. ఈ వరల్డ్‌ కప్‌ ముందు బట్లర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. తనను షాక్‌కు గురిచేశాయని హఫీజ్ పేర్కొన్నాడు. 

‘‘దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తూ కెప్టెన్‌గా ఉన్న జోస్ బట్లర్ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని అనుకోలేదు. ఐపీఎల్‌ సమయంలో ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండకూడదని చెప్పడం విడ్డూరంగా ఉంది. దేశం కోసం ఆడటం ఎప్పుడూ గర్వంగా ఫీల్‌ కావాలి. ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు’’ అని హఫీజ్‌ వ్యాఖ్యానించగా.. మైకెల్‌ వాన్‌ మాత్రం గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ కూడా జరుగుతుందని గుర్తు చేశాడు. 

ఇక్కడ ఆడితే అనుభవం వస్తుంది

‘‘జోస్‌ బట్లర్ వ్యాఖ్యలను అంగీకరిస్తున్నా. ఇలాంటి మెగా లీగుల్లో పాల్గొనడం వల్ల ఆటపరంగా ప్రతిఫలం లభిస్తుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే ఐపీఎల్‌లో ఆడటం గొప్పగా భావిస్తారా? అని కొందరు ప్రశ్నించొచ్చు. ఇక్కడ ఓ అంశం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌. క్రికెట్ బోర్డులు ఏవీ కూడా దానితో పోటీపడలేవు. అందుకే తమ ఆటగాళ్లను ఈ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వడమే అందరికీ మంచిది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ కూడా జరుగుతుంది కదా. ఐపీఎల్, పీఎస్ఎల్‌ వల్ల ఎక్కువ ప్రభావం ఇంగ్లాండ్‌ క్రికెటర్ల మీదే ఉంటుంది. అదే సమయంలో (మార్చి, మే) కౌంటీ క్రికెట్‌ షెడ్యూల్‌ ఉంటుంది. స్టార్‌ క్రికెటర్లు మిస్‌ అవుతారు. అలాగని ఇతర లీగులను తక్కువ చేయడానికి వీల్లేదు’’ అని వాన్‌ వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌ సెమీస్‌కు దూసుకుపోగా.. పాక్‌ మాత్రం లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఆ అక్కసునంతా ఇలా ఐపీఎల్‌పై చూపిస్తున్నాడని హఫీజ్‌ను విమర్శిస్తూ నెట్టింట ట్రోలింగ్‌ మొదలైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని