T20 World Cup 2024: 17 మంది ప్లేయర్లకు 60 రూమ్‌లు.. మీరు హాలిడేకు వెళ్లారా?: పాక్‌పై మాజీల ఆగ్రహం

పాకిస్థాన్ క్రికెట్‌ జట్టుపై మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీ20 ప్రపంచ కప్‌లో లీగ్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated : 20 Jun 2024 14:22 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) పాకిస్థాన్‌ లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. యూఎస్‌ఏ చేతిలో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదనే వార్తలు వస్తున్నాయి. కెప్టెన్ బాబర్‌ అజామ్‌తోపాటు ఐదారుగురు ప్లేయర్లు యూఎస్‌ నుంచి నేరుగా లండన్‌ వెళ్లినట్లు సమాచారం. కొన్ని రోజులు అక్కడే ఉండి.. ఆ తర్వాత పాక్‌కు వెళ్తారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా తమ జట్టు వైఫల్యంపై మాజీ క్రికెటర్ అతిక్ ఉజ్‌ జమాన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. తమ జట్టు ఆటగాళ్లు క్రికెట్‌ ఆడటానికి వెళ్లినట్లు లేదని.. కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేసినట్లు ఉందని వ్యాఖ్యానించాడు. 

‘‘క్రికెట్ ఆడుతున్నట్లు భలే డ్రామా చేశారు. అభిమానులను మీరు (పాక్‌ ఆటగాళ్లను ఉద్దేశించి) మోసం చేశారు. మేం క్రికెట్ ఆడే సమయంలో మాతోపాటు కోచ్, మేనేజర్‌ మాత్రమే ఉండేవారు. జట్టును చాలా పద్ధతిగా నడిపేవారు. ఇప్పుడు మాత్రం 17 మంది ప్లేయర్లు ఉంటే 17 మంది అధికారులు ఉన్నారు. మొత్తం 60 రూమ్‌లు బుక్‌ చేశారు. అసలు మీరంతా క్రికెట్‌ ఆడటానికి వెళ్లారా? హాలిడేను ఆస్వాదించడానికి వెళ్లారా? ఇదేదో మీకు తమాషాలా ఉంది. ఇలాంటి మెగా టోర్నీలకు కుటుంబసభ్యులను ఎందుకు అనుమతిచ్చారు. భార్యతో కలిసి విహారయాత్రలకు వెళ్లినట్లు వెళ్తారా? క్రికెట్ మీద ఇంకెక్కడ ఫోకస్ చేస్తారు. కేవలం కుటుంబం, పిల్లలు, భార్య.. ఇలాంటి విషయాలపైనే ఆసక్తి చూపిస్తారు. జట్టు సభ్యులంతా కలిసి కూర్చుని తినాల్సిన సమయంలోనూ వీరు మాత్రం కుటుంబసభ్యులతో కలిసి ఉన్న వీడియోలు బయటకొచ్చాయి. 

పాకిస్థాన్ క్రికెట్‌లో ఇలాంటి కల్చర్‌ రావడం మరింత బాధిస్తోంది. ఇక్కడ ఎవరికీ క్రమశిక్షణ అంటే ఏంటో కూడా తెలియదు. ఇలాంటి మెగా టోర్నీలో మీ ఫోకస్ ఎలా ఉండాలి? వ్యక్తిగతంగా కొద్ది రోజులు అంతా పక్కన పెట్టేసి క్రికెట్‌పైనే దృష్టి పెట్టాల్సిన సమయం. దేశం కోసం అలా కూడా చేయలేరా? మీకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు’’ అని అతిక్‌ విమర్శించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని