T20 League: వదులుకున్న ఆటగాళ్లే.. పాత జట్లకు షాకిస్తున్నారు

టీ20 లీగ్‌ అంటేనే అంచనాలకు అందని ఆట. ఏ ఆటగాడు ఎప్పుడు ఎలా రాణిస్తాడో అర్థంకాదు. వీళ్లు బాగా ఆడతారు అనుకున్నవాళ్లు విఫలమవుతుంటారు. ఆ ఏం ఆడతారులే...

Updated : 17 Apr 2022 12:54 IST

గొప్పగా రాణిస్తూ కొత్త జట్లకు ఊపిరి పోస్తోన్న ఆటగాళ్లు..

టీ20 లీగ్‌ అంటేనే అంచనాలకు అందని ఆట. ఎవరు ఎప్పుడు ఎలా రాణిస్తారో.. ఎప్పుడు విఫలమవుతారో ఊహించడం కష్టం. ఒక్కోసారి ఇదే లెక్కన ఆయా ఫ్రాంఛైజీలు కూడా తమ ఆటగాళ్లను అర్థం చేసుకోవడంలో, అట్టిపెట్టుకోవడంలో తడబడుతుంటాయి. దీంతో ఇకపై తమ జట్టులో పెద్దగా అవసరం లేదనుకొని వదిలేసిన ఆటగాళ్లు ఇతర జట్లలో చేరాక మరింత బాగా ఆడుతుంటారు. అలా పలువురు ఆటగాళ్లు ఇంతకుముందు ఆడిన జట్లపైనే ఈసీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ వారికి షాకిస్తున్నారు.


(Photo: Kuldeep Yadav Instagram)

కుల్‌దీప్‌ యాదవ్‌: ఈ సీజన్‌కు ముందు కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కాలం కోల్‌కతా తరఫున ఆడాడు. గత రెండు, మూడు సీజన్లలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో వేలానికి ముందు అతడిని ఆ జట్టు వదిలేసుకుంది. ఈ క్రమంలోనే దిల్లీ కొనుగోలు చేయగా ఇప్పుడు ఆ జట్టులో మెరుగైన గణాంకాలు నమోదు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌ రెండులో ఉన్నాడు. ముఖ్యంగా కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో 4/35 మేటి ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో దిల్లీ 215/5 భారీ స్కోర్‌ సాధించగా.. కోల్‌కతా 171కు ఆలౌటైంది. దీంతో కోల్‌కతాపై దిల్లీ విజయంలో కుల్‌దీప్‌ కీలక పాత్ర పోషించాడు.


(Photo: Jason Holder Instagram)

జేసన్‌ హోల్డర్‌: జేసన్‌ హోల్డర్‌ 2014, 2020, 2021 సీజన్లలో హైదరాబాద్‌ తరఫున ఆడాడు. అయితే, ఈ సీజన్‌కు ముందు ఆ జట్టు వదిలేయడంతో వేలంలో పాల్గొన్నాడు. ఈసారి అతడిపై నమ్మకం ఉంచిన కొత్త జట్టు లఖ్‌నవూ వేలంలో కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కల్పించగా హైదరాబాద్‌పైనే హోల్డర్‌ 3/34 మేటి ప్రదర్శన కనబరిచాడు. అలా ఆ మ్యాచ్‌లో లఖ్‌నవూ 12 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించడంలో మాజీ హైదరాబాద్ ఆల్‌రౌండర్‌ కీలక పాత్ర పోషించాడు. తొలుత లఖ్‌నవూ టీమ్‌ ఏడు వికెట్ల నష్టానికి 169/7 పరుగులు చేయగా.. ఛేదనలో హైదరాబాద్‌ 157/9కే పరుగులకే పరిమితమైంది. దీంతో అతడు లఖ్‌నవూ విజయంలో తన వంతు పని పూర్తి చేశాడు.


(Photo: Rahul Tripathi Instagram)

రాహుల్‌ త్రిపాఠి: రాహుల్‌ త్రిపాఠి గత రెండు సీజన్లలో కోల్‌కతా తరఫున ఆడాడు. అలాగే గతేడాది ఆ జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా రాణించిన అతడు మొత్తం 397 పరుగులు చేశాడు. అయినా ఈ సీజన్‌కు ముందు కోల్‌కతా వదిలేసుకుంది. ఈ నేపథ్యంలోనే మెగా వేలంలో హైదరాబాద్‌ కొనుగోలు చేసి అవకాశాలిచ్చింది. దీంతో ఇప్పుడు ఆ జట్టు తరఫున బాగా ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై డకౌటైన త్రిపాఠి తర్వాత మిగిలిన మ్యాచ్‌లు అన్నింటిలో మెరిశాడు. ముఖ్యంగా కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో 71 పరుగులు చేసి హైదరాబాద్‌ విజయంలో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 175/8 భారీ స్కోర్‌ సాధించగా.. హైదరాబాద్‌ 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


(Photo: Shivam Dube Instagram)

శివమ్‌ దూబే: ఈ సీజన్‌లో చెన్నై స్టార్ బ్యాటర్‌గా రాణిస్తున్న ఆటగాడు శివమ్‌ దూబే. గతేడాది రాజస్థాన్‌ తరఫున ఆడగా.. అంతకుముందు రెండేళ్లు బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఇప్పుడు చెన్నై జట్టులో చేరిన అతడు గతేడాది ఆ జట్టుపైనే ఒక మ్యాచ్‌లో 64* పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ఈసారి వేలంలో చెన్నై సొంతం చేసుకొని మంచి అవకాశాలిచ్చింది. దీంతో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో అతడు 95* పరుగులు చేసి కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. అప్పటివరకు వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టుకు దూబే తొలి విజయంతో ఊరటనిచ్చాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 216/4 స్కోర్‌ చేయగా.. బెంగళూరు 193/9 పరుగులకే పరిమితమైంది. అయితే, బెంగళూరు జట్టులో దూబే ఒక్కసారి కూడా ఆకట్టుకోలేకపోయాడు.


(Photo: Jos Buttler Instagram)

జోస్‌ బట్లర్‌: రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఇప్పుడు సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే అతడు ఈ సీజన్‌లో 272 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు 2016-17 సీజన్లలో ముంబయి తరఫున ఆడిన అతడు 2018 నుంచీ రాజస్థాన్‌ తరఫునే కొనసాగుతున్నాడు. అయితే, ప్రస్తుత సీజన్‌లో దంచికొట్టుడే పనిగా పెట్టుకున్న బట్లర్‌.. ముంబయితో ఆడిన మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. బట్లర్‌ (100) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 193/8 భారీ స్కోర్‌ చేసింది. ముంబయి బౌలర్లను అతడు ఉతికారేశాడు. ఛేదనలో రోహిత్‌ టీమ్‌ 170/8 స్కోర్‌కే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో బట్లర్‌ సైతం తన పాత జట్టుపై అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి రాజస్థాన్‌ గెలవడంలో ముఖ్య భూమిక పోషించాడు.


(Photo: Yuzvendra Chahal Instagram)

* ఇక బెంగళూరు మాజీ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ ఈసారి రాజస్థాన్‌ జట్టుకు వెళ్లినపోయిన సంగతి తెలిసిందే. అయితే, బెంగళూరుతో రాజస్థాన్‌ ఆడిన మ్యాచ్‌లో మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిస్తే.. చాహల్‌ మాత్రమే (2/15) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అలాగే వికెట్లు కూడా సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 169/3 పరుగులు చేయగా.. బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అలాగే దిల్లీ మాజీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి వేలంలో కోల్‌కతాకు వెళ్లాడు. అక్కడ కెప్టెన్‌గా ఫర్వాలేదనిపిస్తూనే బ్యాటింగ్‌లోనూ ఆ జట్టును ఆదుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో శ్రేయస్‌ 54 అర్ధ శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో దిల్లీ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 171కు ఆలౌటైంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని