KL or KS: కేఎల్‌ రాహుల్‌ X కేఎస్‌ భరత్‌.. నా మద్దతు అతడికే: సబా కరీం

జూన్‌ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్‌తోనే భారత్‌ తలపడనుంది. అయితే తుది జట్టులో ఎవరు ఉండాలనేదానిపై తీవ్ర చర్చ సాగుతోంది.

Published : 17 Mar 2023 01:22 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిష్‌ ఫైనల్‌కు (WTC Final) దాదాపు మూడు నెలల సమయం ఉంది. కానీ, ఇప్పటి నుంచే తుది జట్టులో ఎవరు ఉండాలి...? ఏ ప్లేయర్‌ ఆడితే బాగుంటుంది..? వంటి అంశాలపై మాజీలు తెగ చర్చించేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో రిషభ్‌ పంత్‌  వికెట్‌ కీపర్‌గా అందుబాటులో లేడు.  దీంతో  కీపింగ్‌ బాధ్యతలను చేపట్టే ఆటగాడిపైనే ఇప్పుడంతా చర్చ సాగుతోంది.  ప్రస్తుతం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వారిలో కేఎస్ భరత్ ఒకరు కాగా.. మరొకరు కేఎల్‌ రాహుల్‌ కావడం విశేషం. ఇప్పటికే దినేశ్ కార్తిక్‌, సునీల్ గావస్కర్‌ తమ అభిప్రాయాలను వెల్లడించగా.. తాజాగా మాజీ క్రికెటర్,  బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీం కూడా స్పందించారు. 

‘‘తుది జట్టు ఎంపిక అనేది మేనేజ్‌మెంట్‌ తీసుకునే నిర్ణయం. కానీ, వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. ఇటీవల కాలంలో జట్టు యాజమాన్యం ఎక్కువగా యువకులకు అవకాశం కల్పిస్తోంది. వారిలో భద్రతాభావం పెరిగేలా చేస్తోంది. అందుకోసం అత్యుత్తమ వాతావరణం తయారు చేసింది. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల కఠినంగా ఉండటం లేదు. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన యంగ్‌ క్రికెటర్లపై నమ్మకం ఉంచింది. కేఎల్ రాహుల్‌ను కేవలం బ్యాటర్‌గానే జట్టులోకి తీసుకోవచ్చు. అంతేకానీ, రిషభ్‌ పంత్‌ లేడని అతడి స్థానంలో రాహుల్‌కు అవకాశం ఇవ్వడం సరైంది కాదు. యువ క్రికెటర్‌కు ఛాన్స్‌ ఇస్తే బాగుంటుంది’’ అని కరీం తెలిపాడు. 

‘‘కేఎస్‌ భరత్‌కు భారత మేనేజ్‌మెంట్ మరిన్ని అవకాశాలు ఇస్తుందని భావిస్తున్నా. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి పిచ్‌పై ఆడటం యువ క్రికెటర్‌కు సవాల్‌తో కూడుకున్నదే. అయితే, ఇప్పటి వరకు కొన్ని టెస్టు మ్యాచుల్లో వికెట్ల వెనుక భరత్‌ అద్భుతంగా చేశాడు. అయితే, మరిన్ని అంశాల్లో మెరుగు కావాల్సి ఉంది. అందుకే, అతడిని సన్నద్ధం చేయడానికి అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ నుంచి భారత్ A తరఫున చాలా సవాళ్లను ఎదుర్కొని ఉంటాడు. అలాంటప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ తన స్థానంపై నమ్మకం కలిగేలా ఛాన్స్ ఇస్తే ఉత్తమం’’ అని సబా కరీం చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని