IND vs NZ : తుది జట్టులో ఎవరు ఉంటారు.. ఎవరికి దక్కేనో అవకాశం! 

చేతికి అందినట్టే అంది విజయం చేజారితే ఎలా ఉంటుందో టీమ్‌ఇండియాని చూస్తే అర్థమవుతుంది. ఒకే ఒక్క వికెట్‌...

Updated : 02 Dec 2021 12:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  అయ్యారే..! చేతికి అందినట్టే అంది విజయం చేజారితే ఎలా ఉంటుందో టీమ్‌ఇండియాని చూస్తే అర్థమవుతుంది. ఒకే ఒక్క వికెట్‌ పడగొడితే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పరాభవానికి కొంచెమైనా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండేది. మన బౌలర్లు రాణించినా చివరికి విజయం మాత్రం వరించలేదు. కివీస్ టెయిలెండర్లు అద్భుత పోరాటంతో జట్టును ఓటమి నుంచి కాపాడుకున్నారు. ఈ క్రమంలో ముంబయి టెస్టుకు (డిసెంబర్ 3 - 7) అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగాలని భారత జట్టు భావిస్తోంది.

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం అసలైన క్రికెట్‌ రుచిని ఆస్వాదించేలా చేసింది. తాత్కాలిక సారథి అజింక్య రహానె బ్యాటింగ్‌లో (35, 4) విఫలమైనా జట్టును నడిపించడంలో మాత్రం విజయం సాధించాడనే చెప్పాలి. యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్ (105, 65) అరంగేట్రంలోనే చెలరేగిపోయాడు. బౌలర్లూ తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే, రెండో టెస్టుకు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ జట్టుతోపాటు చేరనున్నాడు. ఈ క్రమంలో ఎవరిని పక్కన పెట్టాలనే దానిపై  జట్టు మేనేజ్‌మెంట్‌ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రెండో టెస్టు కోసం జట్టును బీసీసీఐ ప్రకటించలేదు. విరాట్ కోహ్లీ రానుండటంతో ఎవరిని పక్కనపెడతారు.. లేకపోతే కొత్తగా జట్టులో మార్పులు ఏమైనా ఉంటాయా? అనేది ఓ సారి పరిశీలిద్దాం.. 

* సూర్యకుమార్‌కు అవకాశం కల్పించాలని భావిస్తే.. ఖాళీ చేయగలిగిన స్థానాల్లో ఓపెనింగ్‌ ఒకటి. తొలి టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా విఫలమైన మయాంక్‌ అగర్వాల్‌ (13, 17) స్థానంలో సూర్యకుమార్‌కు చోటు ఇవ్వొచ్చు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (52, 1) మొదటి ఇన్నింగ్స్‌లో రాణించాడు. కాబట్టి, గిల్‌ చోటుకు ఇప్పటికైతే ఢోకా ఉండకపోవచ్చు. మయాంక్‌కే మరో అవకాశం ఇస్తే మాత్రం సూర్యకుమార్‌ ఈసారి కూడా డగౌట్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. 

* విరాట్‌ వస్తే మిడిలార్డర్‌లో పుజారా, రహానె, శ్రేయస్‌ అయ్యర్‌లలో ఒకరిని తప్పించాల్సిందే.. మరి పుజారా (26, 22), రహానె (35, 4) ఇద్దరూ రాణించలేదు. ఇక అరంగేట్రం బ్యాటర్‌ శ్రేయస్‌ మాత్రం విజృంభించాడు. తన తొలి మ్యాచ్‌లోనే శతకం, అర్ధశతకం సాధించాడు. దీంతో జట్టు ఎంపికలో క్లిష్టత ఏర్పడింది. విఫలమైన పుజారా, రహానెలలో ఒకరిని పక్కన పెట్టాలా...? అద్భుతంగా రాణించిన అయ్యర్‌కు తప్పించాలో తెలియని సందిగ్ధత టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌లో నెలకొంది. ఒకవేళ సాహసం చేసి పుజారా, రహానెలను తప్పించి.. సూర్యకుమార్‌, శ్రేయస్‌లకు అవకాశం కల్పించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పుజారా, రహానె తమ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదని విమర్శలొస్తున్నాయి. రెండో టెస్టుకు జట్టులో స్థానం దక్కితే మాత్రం మెరుగైన ప్రదర్శనను ఇవ్వాలి. లేకపోతే డిసెంబర్‌ రెండో వారం నుంచి జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

* ఇక బౌలర్ల విషయానికొస్తే.. స్పిన్నర్లను కదిలించే పరిస్థితి లేదు. సీనియర్‌ బౌలర్‌ అశ్విన్‌ నేతృత్వంలోని స్పిన్‌ దళం పటిష్ఠంగానే ఉంది. అశ్విన్‌తోపాటు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. ప్రయోగం చేద్దామని భావిస్తే మాత్రం జయంత్‌ యాదవ్‌కు అవకాశం లభించవచ్చు. అప్పుడు ఎవరిని తొలగిస్తారో తెలియని పరిస్థితి. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా (61*) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే వెన్ను నొప్పితో ఫీల్డ్‌లోకి దిగలేదు. దీంతో తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ కీపింగ్‌ చేసి ఆకట్టుకొన్నాడు. ఒక వేళ రెండో టెస్టు నాటికి సాహా అందుబాటులో ఉండకపోతే సుదీర్ఘఫార్మాట్‌లోకి భరత్‌ అరంగేట్రం దాదాపు ఖాయమే. ఫాస్ట్‌ బౌలర్లు ఉమేశ్ యాదవ్‌, ఇషాంత్ శర్మ స్థానంలో కుర్రాళ్లు మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిధ్ కృష్ణకు ఛాన్స్‌ దక్కనుంది. ఏ మార్పులు చేయకపోతే సీనియర్ల స్థానాలకు ఇబ్బందేమీ ఉండదు. పిచ్‌ను బట్టి ముగ్గురు పేస్‌ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో దిగాలనుకుంటే సిరాజ్‌కు చోటు కల్పించి.. అక్షర్, జడేజాలో ఒకరిని తప్పించే అవకాశం ఉంది.

ఇక్కడ ఆడితేనే.. అక్కడికి!

ఓమిక్రాన్‌ వైరస్‌ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన అయోమయంలో పడింది. మరోపక్క క్రికెట్‌ సౌతాఫ్రికా మాత్రం బయోబబుల్‌ ఏర్పాట్లు చేస్తామని చెబుతోంది. ఒకవేళ పర్యటన ఖరారు అయితే మాత్రం దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లను టీమ్‌ఇండియా ఆడనుంది. తొలి టెస్టు (డిసెంబర్ 17 - 21), రెండో టెస్టు (డిసెంబర్ 26-30), మూడో టెస్టు (జనవరి 3 - 7) జరుగుతాయి. వన్డేలు (జనవరి 11, 14, 16), టీ20లు ( జనవరి 19, 21, 23, 26 తేదీలు) నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్‌ తయారు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే భారత్‌-ఏ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా.. సీనియర్ల జట్టు డిసెంబర్ 9న బయలుదేరనుంది. రెండో టెస్టులో రాణిస్తే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆటగాళ్లకు ప్రతి ఇన్నింగ్స్‌.. ప్రతి పరుగూ కీలకమైందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని